English   

వరల్డ్ ఫేమస్ లవర్ కు అదిరిపోయే బుకింగ్స్.. 

World Famous Lover
2020-02-12 12:09:55

సంక్రాంతి సినిమాల తర్వాత బాక్సాఫీస్ మరోసారి మూగబోయింది. రవితేజ డిస్కో రాజా సినిమా వచ్చినా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. నాగశౌర్య అశ్వద్ధామ సినిమా కూడా ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది. ఇక భారీ అంచనాలతో వచ్చిన జాను సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాపై ముందు పెద్దగా అంచనాలు లేవు కానీ విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తి పెరిగిపోయింది. 

ముఖ్యంగా ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇందులో మూడు రకాల భిన్నమైన పాత్రల్లో నటించాడు విజయ్. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి సినిమాలు తెరకెక్కించిన క్రాంతి మాధవ్ దీనికి దర్శకుడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు ఈ సినిమాను నిర్మించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. ఒక్క హైదరాబాద్ సిటీలో 190 షోలకి బుక్ మై షోలో ఇప్పటికే 120 షోలు ఫుల్ అయిపోయాయి. మిగతా టిక్కెట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. విజయ్ దేవరకొండ సినిమాకి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. 

ప్రస్తుతం ఈ సినిమాపై ఉన్న అంచనాలు చూస్తుంటే తొలి రోజు కచ్చితంగా 8 నుంచి 10 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చేలా కనిపిస్తోంది. విజయ్ గత సినిమా డియర్ కామ్రేడ్ నిరాశపరిచినా కూడా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాపై అంచనాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వస్తారని చెబుతున్నాడు ఈ కుర్రహీరో. ఈ సినిమాలో రాశిఖన్నా ఐశ్వర్య రాజేష్ కాథరిన్ తెరెసా ఎజిబిల్లాతో అదిరిపోయే రొమాన్స్ చేశాడు విజయ్. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మరో సంచలన విజయం అందుకుంటాడా లేదా అనేది చూడాలి. 

More Related Stories