English   

రజనీ పోటీ చేసేది అక్కడి నుండేనా..

Rajinikanth
2020-02-13 13:18:12

సూపర్‌ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమైపోయింది. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఆయన బరిలోకి దిగే అసెంబ్లీ సెగ్మెంట్‌పై ఆసక్తి నెలకొంది. సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టిన తర్వాత ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే అంశంపై తమిళనాడులో విస్తృత చర్చ నడుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని ప్రకటించేందుకు ఇప్పటికే రజనీకాంత్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను పోటీ చేయాల్సిన నియోజకవర్గాన్ని ఆయన ఇప్పటికే ఎంపిక చేసుకున్నారని సన్నిహిత వర్గాలంటున్నాయి.

మహారాష్ట్రకు చెందిన రజనీకాంత్ సినిమాల్లోకి వచ్చాక తమిళనాడులో సెటిలయ్యారు. ఆ రాష్ట్ర ప్రజలు కూడా ఆయన్ను ఓన్ చేసుకున్నారు. అయితే దర్బార్‌ చిత్రంలోని ఓ సీన్‌లో తన సొంతూరు కృష్ణగిరి జిల్లా నాచ్చికుప్పమంటూ రజనీకాంత్ డైలాగ్ చెప్పారు. తన పూర్వీకులది నాచ్చికుప్పమని ఒకానొక సందర్భంలో అభిమానులతోనూ అన్నారు. దీంతో ఆ గ్రామం వేప్పనహళ్లి నియోజకవర్గంలోకి వస్తుంది కాబట్టి రజనీ అక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులు ఈ నియోజకవర్గంలోని చెరువుల్లో పూడికతీత, సంక్షేమాల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.  రజనీకాంత్‌ సోదరుడు సత్యనారాయణ రావు కూడా వీటికి హజవర్వడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.  2011, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ డీఎంకే అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో  రజనీకాంత్‌ పోటీ చేస్తే తమ విజయావకాశాలు ఎలా ఉంటాయనే విషయంపై ఇప్పటికే ఆ పార్టీ సర్వే చేయించినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది తమిళ సంవత్సరాదికి రజనీకాంత్ నూతన పార్టీ ఆవిర్భావం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మదురై లేక తిరుచ్చిలో మహానాడు నిర్వహించి పార్టీ పేరు, జెండాను ప్రకటిస్తారంటూ ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఇక పొత్తులపై కూడా రజనీకాంత్ క్లారిటీగా ఉన్నారని వారు చెబుతున్నారు. చాలా రోజుల నుంచి బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న రజనీకాంత్...వచ్చే ఎన్నికల్లో వారితో కలిసి పనిచేయడం ఖాయంగా కనిపిస్తోంది. తమిళనాడుకు చెందిన బీజేపీ నేతలు కూడా వీటిని బలపరుస్తున్నారు. 

More Related Stories