విజయ్ దేవరకొండ.. నువ్ మారకపోతే కష్టమే ఇంక..

విజయ్ దేవరకొండ నువ్వు ఇంకా ఎప్పుడు మారుతావు.. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చూసిన తర్వాత అభిమానులు ఈయనను అడుగుతున్న ప్రశ్న ఇదే. నేను ఇంక ప్రేమకథలు చేయదలచుకోలేదు.. ఇప్పటినుంచి విభిన్నమైన కథలు ప్రయత్నిస్తాను అంటూ విజయ్ చెబితే ఏదో అనుకున్నారు.. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చూసిన తర్వాత ఆయన ఎందుకు అలా అన్నాడనేది అర్థమవుతుంది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా హ్యాంగోవర్ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాడు విజయ్ దేవరకొండ. ఆయనతో ఏ దర్శకుడు ఈయనతో సినిమా చేయాలనుకున్నా మళ్లీ అర్జున్ రెడ్డి లాంటి కథతోనే రావడం.. దానికి ఈయన ఓకే చెప్పడం.. సినిమా తీసిన తర్వాత అది నిరాశ పరచడం వరుసగా జరుగుతున్నాయి.
అందుకే పూర్తిగా ప్రేమకథలకు దూరంగా జరుగుతున్నట్లు ప్రకటించాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా విజయ్ క్యారెక్టర్ దాదాపు అర్జున్ రెడ్డి స్టైల్ లోనే సాగుతుంది. సింగరేణి సీనయ్య క్యారెక్టర్ మాత్రమే ఆకట్టుకుంటుంది. విజయ్ దేవరకొండ, ఐశ్వర్య రాజేష్ ఉన్న 40 నిమిషాల ఎపిసోడ్ సినిమాలో అదిరిపోయింది. కానీ ఆ తర్వాత మళ్లీ అదే చేశాడు దర్శకుడు క్రాంతి మాధవ్. సెకండ్ హాఫ్ అంతా మరోసారి అర్జున్ రెడ్డిలో ఉన్న విజయ్ దేవరకొండను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అభిమానులకు ఫస్టాఫ్ పర్లేదు అనిపించినా సెకండాఫ్ మాత్రం సహనానికి పరీక్ష పెట్టాడు క్రాంతి మాధవ్. తెలిసిన కథను మరింత రొటీన్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించడం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు నెగిటివ్ గా మారిపోయింది. ఈ సినిమాతో సిక్సర్ కొట్టాలని విజయ్ దేవరకొండ బాగానే ట్రై చేశాడు కానీ పరిస్థితులు చూస్తుంటే బౌండరీ దగ్గర బంతి దరికిపోయేలా కనిపిస్తుంది.