సీనియర్ నటుడు శ్రీకాంత్ ఇంట తీవ్రవిషాదం

టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న చిరంజీవి మొదటి సినిమా దర్శకుడు రాజ్ కుమార్, అదే రోజున మరో వర్ధమాన నటుడు టాలీవుడ్ కి దూరమయ్యారు. ఇప్పుడు తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ లో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ముద్ర వేసుకున్న శ్రీకాంత్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి మేకా పరమేశ్వరరావు నిన్న పొద్దుపోయాక తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన గత నాలుగు నెలలుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న సమస్య తీవ్రతరం కావడంతో ఆయన కన్నుమూశారు.
1948 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా మేకావారిపాలెంలో జన్మించిన పరమేశ్వరరావు వ్యవసాయం నిమిత్తం కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవపాలెంకు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహాప్రస్థానంలో పరమేశ్వరరావు అంత్యక్రియలు జరుగుతాయని చెబుతున్నారు. దీని మీద మరింత సమాచారం అందాల్సి ఉంది. ఆయన మృతి విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు శ్రీకాంత్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు.