గోపీచంద్ రానాలతో తేజ సినిమా...ఆసక్తికర టైటిల్

హీరో గోపీచంద్ కెరీర్ కొన్నాళ్ళగా తిరోగమన దిశలో పయనిస్తోంది. అప్పుడెప్పుడో ఆరేళ్ళ క్రితం లౌక్యం అనే సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో ఆ తర్వాత అరడజను సినిమాలు చేసినా అవి వర్కౌట్ కాలేదు. ఈ మధ్యనే ఎన్నో ఆశలతో భారీ బడ్జెట్ పెట్టి చేసిన ‘చాణక్య’ కూడా నిరాశపరచడంతో అయోమయంలో పడిన ఆయన ఇప్పుడు సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ అనే సినిమా చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన మేల్ హాకీ కోచ్ గా కనిపించనున్నాడు. అదే సినిమాలో తమన్నా ఫీమేల్ హాకీ కోచ్ గా కనిపించనున్నది.
ఈ సినిమా పూర్తి అయ్యాక ఆయన తనకి అచ్చొచ్చిన పాత దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్దమయ్యారు. డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో గోపీచంద్ ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ ని పట్టాలెక్కించబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఏప్రిల్ నుండి సెట్స్ మీదకి వెళ్లనున్న ఈ సినిమా ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి స్పెషల్ రోల్ లో నటించనున్నారని సమాచారం. ఈ సినిమాకి ‘‘అలివేలుమంగ వెంకటరమణ’’ అనే టైటిల్ ఖరారు చేయనున్నారని అంటున్నారు. మరి ఈ రూమర్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే.