English   

పడిపోతున్న పవన్ కళ్యాణ్ మార్కెట్.. పెరిగిపోతున్న నిర్మాతల టెన్షన్..

pawan kalyan
2020-02-17 18:58:39

వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తే అది ఎలా ఉంటుంది అనే భయాలు లేకుండా భారీ రేటు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనేసే వాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. వరుసగా కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి సినిమాలు తీసుకొచ్చిన నష్టాలు డిస్ట్రిబ్యూటర్లలో భయాన్ని పెంచేస్తున్నాయి. ఆయన రాజకీయాలు చేస్తూ సినిమాలు చేస్తుండటంతో.. ఆసక్తి లేకుండానే కేవలం డబ్బులు కోసం సినిమాలు చేస్తున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు కూడా వస్తున్నాయి. 

ఇలాంటి సమయంలో ఆయన నటిస్తున్న పింక్ సినిమా రీమేక్ బిజినెస్  ఊహించిన స్థాయిలో జరగడం లేదని ప్రచారం జరుగుతోంది. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయిపోయింది. హిందీలో సంచలన విజయం సాధించిన పింక్ సినిమాను తమిళంలో నేర్కొండ పార్వై పేరుతో రీమేక్ చేశారు. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. 

అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న కొద్దీ ఎందుకో తెలియదు కానీ బిజినెస్ రేంజ్ పడిపోతుంది. ముందు ఈ సినిమాను దాదాపు 120 కోట్ల నుంచి 130 కోట్ల మధ్య బిజినెస్ చేయాలని భావించాడు దిల్ రాజు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే 60 నుంచి 80 కోట్ల మధ్యలోనే పింక్ సినిమా రీమేక్ బిజినెస్ పూర్తయ్యేలా కనిపిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ మార్కెట్ నిజంగానే పడిపోయినట్లు. 

ఎందుకంటే రెండేళ్ల కిందట విడుదలైన అజ్ఞాతవాసి సినిమా అప్పట్లోనే 120 కోట్ల బిజినెస్ చేసింది. మరి ఇప్పుడు పింక్ సినిమాతో ఈయన మళ్లీ మ్యాజిక్ చేస్తే తప్ప పవన్ కళ్యాణ్ మార్కెట్ మునుపటిలా పుంజుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పవర్ స్టార్ కమ్ బ్యాక్ ఎలా ఉంటుందనేది చూడాలి. మే 15న ఈయన సినిమా విడుదలవుతుంది. 

More Related Stories