ప్రభాస్ నే పట్టేసిన నాగ్ అశ్విన్

‘ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ‘మహానటి’ సినిమాతో జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించి జాతీయ అవార్డ్స్ సైతం అందుకున్నాడు. అయితే మహానటి విడుదలై రెండేళ్లు దాటుతున్నా ఇంత వరకు ఆయన నుంచి మరో చిత్రమేదీ ప్రకటించలేదు. మెగాస్టార్ కోసం ఒకసారి నాని కోసం మరోసారి కథలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలొచ్చినప్పటికీ ఏదీ నిజం కాలేదు.
కానీ తాజాగా టాలీవుడ్ లో మరో వార్త హల్చల్ చేస్తోంది. అదేంటంటే ఈ యువ దర్శకుడు ప్రభాస్తో పని చేసేందుకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కు సరిపడేలా ఒక ఇంటరెస్టింగ్ లైన్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి ప్రభాస్ మరే కొత్త సినిమాకి కమిట్మెంట్ ఇవ్వలేదు. ‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జాన్’(వర్కింగ్ టైటిల్) సినిమా సొంత బ్యానర్ మీద చేస్తుండడంతో ఆ సినిమాకి నష్టాల పాలు కాకుండా బయట పాడడం మీదే ద్రుష్టి పెట్టాడు. ఈ సినిమా పూర్తి అయ్యాక అశ్విన్ తో సినిమా పట్టాలెక్కించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రభాస్ కోసం రాజమౌళి, కొరటాల శివ, బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ లు కథలు సిద్ధం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ సినిమాతో బిజీ, ప్రభాస్ కు ఇప్పుడప్పుడే బాలీవుడ్ కు వెళ్లే ఆలోచన లేదట.