కాజల్ కు తృటిలో తప్పిన పెనుప్రమాదం

‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘భారతీయుడు-2’ సెట్స్‌లో జరిగిన ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పదిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కమల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్ తదితరులు నటిస్తున్నారు.
చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా నిన్న రాత్రి 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ ప్రమాదవశాత్తు తెగి కింది ఉన్న టెంట్‌పై పడింది. ఈ ఘటనలో టెంట్ కింద ఉన్న వారిలో శంకర్ పర్సనల్ అసిస్టంట్ మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34), సెట్ బాయ్ చంద్రన్ ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని సవిత ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏకంగా శంకర్ కాలు పూర్తిగా దెబ్బ తిన్నాడని ప్రచారం జరిగింది. అయితే అదేమీ లేదని కూడా క్లారిటీ ఇచ్చింది సినిమా యూనిట్.
ఇక ఈ ప్రమాదంపై స్పందించిన కమల్ ఈ ఘటన తన మనసును కలచివేసిందన్నారు. ముగ్గురిని కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. వారి కన్నవారి కంటే తన బాధ ఎన్నో రెట్లు ఎక్కువని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదంలో కాజల్ త్రుటిలో తప్పించుకుందని అంటున్నారు. ఈ విషయం కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. కొంచెం ఉంటే కాజల్ కూడా ప్రమాదం జరిగేదని అంటున్నారు.