English   

సంక్రాంతి సూపర్ హిట్.. ఆ తర్వాత సినిమాలు డిజాస్టర్..

cinema
2020-02-21 07:14:08

ఒక మ్యాచ్ మొదలైన తర్వాత ఓపెనర్లు ఇద్దరు వచ్చి 200కు పైగా పార్ట్నర్ షిప్ ఇస్తే ఇక ఆ మ్యాచ్ కు తిరుగుండదు అనుకుంటారు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మన్ వరుసగా ఒకరి తర్వాత ఒకరు డకౌట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది.. ఇప్పుడు తెలుగు సినిమా పరిస్థితి కూడా అలాగే ఉంది. సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు ఘనవిజయం సాధించడంతో ఆ తర్వాత కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని అంచనా వేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. కొత్త సంవత్సరం వచ్చి రావడంతోనే అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సంచలన విజయం సాధించాయి.

అదే దూకుడు తర్వాత సినిమాలు కూడా కంటిన్యూ చేస్తాయని అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయిపోయింది. సంక్రాంతికి వచ్చిన ఎంత మంచివాడవురా సినిమా డిజాస్టర్ అయ్యింది. 10 కోట్ల టార్గెట్ తో విడుదలైన ఈ సినిమా కేవలం 7 కోట్లు మాత్రమే వసూలు చేసి ఫ్లాప్ లిస్ట్ లోకి చేరిపోయింది. రవితేజ నటించిన డిస్కో రాజా 20 కోట్లు బిజినెస్ చేసి కేవలం 7.9 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఈ చిత్రం 12 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్లకు నష్టం తీసుకొచ్చింది. నాగశౌర్య నటించిన అశ్వద్ధామ సినిమా కూడా సూపర్ హిట్ అని ప్రమోట్ చేసుకున్నారు కానీ అది కూడా దాదాపు కోటిన్నర వరకు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చినట్లు తెలుస్తోంది.

ఇక ఈ మధ్య విడుదలైన విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ బయ్యర్లను దారుణంగా ముంచేస్తుంది. విజయ్ దేవరకొండ పై ఉన్న నమ్మకంతో ఈ సినిమాని దాదాపు 30 కోట్ల వరకు బిజినెస్ చేస్తే ఇప్పటి వరకు కనీసం 10 కోట్లు కూడా రాలేదు. దాంతో 20 కోట్ల వరకు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు నిట్టనిలువునా ముంయడానికి సిద్ధమైపోయింది. మధ్యలో దిల్ రాజు నిర్మాతగా సమంత శర్వానంద్ జంటగా వచ్చిన జాను సినిమా కూడా ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. ఫీల్ గుడ్ సినిమా అంటూ ఈ సినిమాను ఎంత ప్రమోట్ చేసినా కూడా మన ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. దాదాపు 18 కోట్ల బిజినెస్ చేసిన జాను కేవలం 8 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఇలా సంక్రాంతి సూపర్ హిట్ అయినా కూడా ఆ తర్వాత మాత్రం వచ్చిన ప్రతి సినిమా డిజాస్టర్ అయిపోయింది.

 

More Related Stories