నాని బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమాల కళకళ..

అనామకుడిగా ఇండస్ట్రీకి వచ్చాడు.. అసాధ్యుడిగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన పేరు చెబితే ఇండస్ట్రీలో సంచలనమే. ఎలాంటి అండదండలు లేకుండా స్టార్ హీరో అయ్యాడు. మనం మాట్లాడుకునేది ఎవరి గురించో ఈ పాటికే క్లారిటీ వచ్చింది కదా.. అంత సత్తా ఈ 12 ఏళ్లలో చూపించింది ఒక్క నాని మాత్రమే. ఫిబ్రవరి 24న ఈయన పుట్టిన రోజు. సెప్టెంబర్ 5, 2008న ఈయన నటించిన తొలి సినిమా అష్టాచమ్మా విడుదలైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో సైలెంట్ హిట్ అయింది. నాని ఎవరో అప్పటికి ఎవరికీ తెలియదు. అసిస్టెంట్ డైరెక్టర్ కాస్తా హీరో అయ్యాడు.. ఆ తర్వాత హిట్ అయ్యాడు.
నటనకు ముందు రేడియో జాకీగా కొన్నాళ్లు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్నేళ్లు పనిచేసాడు. బాపు, శ్రీనువైట్ల లాంటి దర్శకుల దగ్గర కొంతకాలం ఏడిగా పనిచేసాడు ఈ హీరో. ఆ తర్వాత అనుకోకుండా ఇంద్రగంటి మోహనకృష్ణ కంట పడ్డాడు. ఢీ టైమ్ లో ఈయన ఓ ఎడిట్ రూమ్ కు వచ్చినపుడు అక్కడ నానిని చూసి ఛాన్స్ ఇచ్చాడు ఇంద్రగంటి. అష్టాచమ్మా తర్వాత నానికి గుర్తింపు ఏం ఎగురుకుంటూ రాలేదు. రైడ్.. భీమిలి కబడ్డిజట్టు.. సెగ.. ఇలా చాలా సినిమాలు విడుదలయ్యాయి కానీ ఏది హిట్ కాలేదు. అలాంటి టైమ్ లో వచ్చిన అలా మొదలైంది నానికి ఇమేజ్ తీసుకొచ్చింది.
ఈ చిత్రం తర్వాత పిల్ల జమీందార్ కూడా హిట్ కావడంతో మనోడి దశ మారిపోయింది. 2012లో ఈగతో స్టార్ అయిపోయాడు. అయితే ఆ తర్వాత వరసగా ఫ్లాపులు వచ్చాయి నానికి. ఎటో వెళ్లిపోయింది మనసు.. పైసా.. ఆహాకళ్యాణం.. జెండా పై కపిరాజు వరకు వరస ఫ్లాపులు ఇబ్బంది పెట్టాయి. అయితే నటుడిగా మాత్రం ప్రతీ సినిమాతో పైకి ఎదిగాడు ఈ హీరో. ఎటో వెళ్లిపోయింది మనసు నానికి నందిని కూడా తీసుకొచ్చింది. ఈ హీరో జాతకం మార్చేసిన సినిమా మాత్రం ఎవడే సబ్రమణ్యమే.
2015 మార్చ్ 21న విడుదలైన ఈ సినిమాతో నాని రేంజ్ మారిపోయింది. ఈ చిత్రం తర్వాత వరసగా ఎనిమిది విజయాలు వచ్చాయి ఈ హీరోకు. నాని నటిస్తే హిట్ అనే నిర్ణయానికి వచ్చేసారు ప్రేక్షకులు. భలేభలే మగాడివోయ్.. కృష్ణగాడి వీర ప్రేమగాధ.. జెంటిల్ మన్.. మజ్ను.. నేనులోకల్.. నిన్నుకోరి.. ఎంసిఏ వరకు ఈయన జైత్రయాత్ర సాగింది. అనుకోకుండా కృష్ణార్జున యుద్ధంతో ఫ్లాప్ ఇచ్చాడు ఈ హీరో. ఆ తర్వాత వచ్చిన దేవదాస్ కూడా డిజాస్టర్ అయింది. అప్పుడు మళ్లీ జెర్సీ సినిమాతో నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కాడు. వెంటనే గ్యాంగ్ లీడర్ సినిమాతో నిరాశ పరిచినా కూడా ఇప్పుడు తన 25వ సినిమా వి తో వచ్చేస్తున్నాడు. ఇందులో విలన్గా నటిస్తున్నాడు నాని. మార్చ్ 25న విడుదల కానుంది ఈ చిత్రం. ఇక ఫిబ్రవరి 24న మరో సినిమా అనౌన్స్ చేస్తున్నాడు నేచురల్ స్టార్. నిర్మాతగా మారి అ.. సినిమా చేసాడు. ఇప్పుడు హిట్ అంటూ ఫిబ్రవరి 28న వస్తున్నాడు