English   

హిట్ ఈవెంట్ సూపర్ హిట్.. టాలీవుడ్ లో నాని రేంజ్ ఇది..

HIT
2020-02-24 09:41:26

తెలుగు ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ నానికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కేవలం ఇప్పుడు హీరో మాత్రమే కాదు నిర్మాత కూడా. కొత్త కొత్త దర్శకులను తన నిర్మాణ సంస్థ నుంచి ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ క్రమంలోనే డాక్టర్ శైలేష్ కుమార్ హిట్ సినిమాతో దర్శకుడిగా మారాడు. 

అ! తో సూపర్ హిట్ అందుకున్న నాని తన రెండో ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మించాడు. విశ్వక్ సేన్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాలో రుహాని శర్మ హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 28న రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఫిబ్రవరి 23 సాయంత్రం గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ కు చీఫ్ గెస్టులుగా రాజమౌళి, రాఘవేంద్ర రావు, అనుష్క, రానా, దిల్ రాజు అటెండ్ అయ్యారు. వీళ్లతో పాటుగా అల్లరి నరేష్, సందీప్ కిషన్, సునీల్, నవదీప్, కార్తికేయ, తరుణ్ భాస్కర్, సుశాంత్ ఇలా యువ హీరోలంతా కనిపించారు ఈ మధ్య కాలంలో ఒక ఈవెంట్ లో ఎంత మంది కనిపించడం ఇదే తొలిసారి. 

తెలుగు ఇండస్ట్రీలో నానికి ఉన్న ఫాలోయింగ్ ఇది. తాను పిలిస్తే కాదనే సెలబ్రిటీ ఇక్కడ ఎవరూ ఉండరు అని మరోసారి నిరూపించాడు నాచురల్ స్టార్. కొందరు విశ్వక్ పిలిస్తే వచ్చానని చెప్పగా కొందరు నాని కోసం వచ్చినట్టు చెప్పారు. ఇలా ఒక సినిమా ఈవెంట్లో ఇంతమంది కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. పిలవగానే ఇంతమంది హిట్ సినిమా ఈవెంట్ కు వచ్చారు అంటే నాని ఇండస్ట్రీలో అందరికీ ఎంత కావలసిన వాడు అనేది అర్థం అవుతుంది. నిర్మాత నానితో పాటు హీరో విశ్వక్ సేన్ కూడా స్పెషల్ గా రానా, కార్తికేయలను పిలిచాడు.

 శైలేష్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రాజమౌళి చేతుల మీదుగా విడుదలైన మూడు నిమిషాల సన్నివేశం సినిమాపై ఆసక్తి మరింత పెంచేసింది. సినిమా మొదటి టికెట్ కొన్న రాజమౌళి టీం అందరికి బెస్ట్ విషెస్ చెప్పారు. మొత్తానికి ఈ సినిమా ఈవెంట్ తో నాని అందరివాడు అనిపించుకున్నాడు.

More Related Stories