నాని పూర్తిగా మారిపోయినట్లేనా.. లేదంటే మళ్లీ కష్టాలు షురూ..

సగటు అభిమాని నానిని అడుగుతున్న ప్రశ్న ఇదే ఇప్పుడు. అసలు నాని అంటే ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం వేరు. ఈయన సినిమా అంటే ఉన్న నమ్మకం వేరు. నాని సినిమా వస్తుందంటే కచ్చితంగా అందులో ఏదో ఒక కొత్త విషయం ఉంటుందని నమ్ముతారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు తన రొటీన్ కథలతో ఈ నమ్మకాన్ని తానే పోగొట్టుకుంటున్నాడు న్యాచురల్ స్టార్. అందరిలా రొటీన్ కథల వైపు అడుగేస్తున్నాడు నాని. మూడేళ్ల కింద దిల్ రాజుతో చేసిన రెండు సినిమాలు అలాంటివే. నేనులోకల్ తో పాటు ఎంసిఏ కూడా పరమ రొటీన్ కథలే. విజయాల్లో సమస్య లేదు కానీ విమర్శలకు కూడా తావిస్తున్నాయి ఈ కథలు. ఆ తర్వాత కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలతో ఫ్లాపులు కూడా ఇచ్చాడు నాని. ఈ రెండు సినిమాల తర్వాత మళ్లీ తన తప్పు తాను తెలుసకుని జెర్సీతో ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా హిట్ కావడంతో నాని గాడిన పడ్డాడని అంతా అనుకున్నారు. కానీ గతేడాది విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమా పరిస్థితి కూడా మళ్లీ అలాగే మారిపోయింది.
ఈయనకు ఉన్న ఫాలోయింగ్.. మార్కెట్ తో ఈ సినిమా ఓపెనింగ్స్ వరకు బాగానే లాక్కొచ్చినా కూడా తర్వాత ఫ్లాప్ అయిపోయింది. ఫస్టాఫ్ వరకు పర్లేదు అనిపించిన కథ.. సెకండాఫ్ లో పూర్తిగా గాడితప్పింది. క్లైమాక్స్ వరకు సోసోగా లాక్కొచ్చాడు దర్శకుడు విక్రమ్ కే కుమార్. నానితో విక్రమ్ కాంబినేషన్ అంటే కొత్తదనం కోరుకున్న ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు ఈ జోడీ. ఈ సినిమా దాదాపు 10 కోట్లకు పైగానే బయ్యర్లకు నష్టాలను తీసుకొచ్చింది. ఇంత రొటీన్ సినిమాతో రావడంతో నాని ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు. ఇప్పటికైనా మేల్కొనకపోతే కచ్చితంగా అసలుకే ఎసరొచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. అసలే ఇప్పుడు కాంపిటీషన్ కూడా ఫుల్లుగా ఉంది. ప్రస్తుతం ఈయన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి అనే సినిమా చేస్తున్నాడు. ఇది నాని 25వ సినిమా. ఇందులో ఆయన ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. మార్చి 25న సినిమా విడుదల కానుంది. దాంతోపాటే శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. నిన్నుకోరి, మజిలీ లాంటి ఎమోషనల్ సినిమాల తర్వాత పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా చేస్తున్నాడు శివ నిర్వాణ. ఈ రెండు సినిమాలు చేస్తూనే ఈమధ్య రాహుల్ సాంక్రీత్యన్ దర్శకత్వంలో శ్యామ సింగ రాయ్ సినిమాను అనౌన్స్ చేశాడు నాచురల్ స్టార్. ఈ మూడూ వేటికవే భిన్నమైన కథలు. ఖచ్చితంగా వీటితో మళ్ళీ సంచలన విజయం సాధిస్తానని నమ్మకంగా చెబుతున్నాడు నాని.