ఆకాశంలో ఊడిపడిన అర్జున.. రాజశేఖర్ సినిమా ఎక్కడిది..

నిన్న మొన్నటి వరకు కనీసం సీన్ లో కూడా కనిపించని సినిమా సడన్ గా త్వరలోనే విడుదల అంటూ వచ్చేసింది. అది ఎలాగో తెలియక తలపట్టుకుంటున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమా ఏది అనే అనుమానాలు మీకు కూడా వస్తున్నాయి కదా.. అవును ఆ సినిమా పేరు అర్జున. రాజశేఖర్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. దాదాపు పుష్కర కాలం కింద చిన్నోడు, నా ఊపిరి లాంటి సినిమాలు తెరకెక్కించిన ఖన్మణి దీనికి దర్శకుడు.
అసలు ఈ చిత్రం ఎప్పుడు మొదలైంది ఎప్పుడు.. షూటింగ్ పూర్తి చేసుకుందనేది ఎవరికీ తెలియదు. పైగా నిర్మాత సి కళ్యాణ్ కూడా కనీసం ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయలేదు. రాజశేఖర్ కూడా ఇలాంటి సినిమా చేస్తున్నట్లు ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు ప్రోమోస్ విడుదల చేసి త్వరలోనే విడుదల అంటున్నాడు నిర్మాత సి.కళ్యాణ్. ఇందులో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేశాడు. పోస్టర్స్ చూస్తుంటే ఇది వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా అని అర్థమవుతుంది.
ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు సినిమాకు పనిచేసిన కొందరు యూనిట్ సభ్యులు కూడా. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి జీవితంపై ఒక సినిమా తెరకెక్కించాలని అనుకున్నాడు పూరి జగన్నాథ్. రాజశేఖర్ రెడ్డి అనే టైటిల్ తో పోస్టర్ కూడా విడుదల చేసారు. అందులో హీరో రాజశేఖర్ అనుకున్నాడు.. సినిమా అనౌన్స్ అయిన తర్వాత అది ఆగిపోయింది. దాంతో ఇప్పుడు ఆ సినిమాను పూర్తి చేస్తున్నాడు రాజశేఖర్. మరి ఈ అర్జున సినిమాతో ప్రేక్షకులను ఈయన ఇంతవరకు మెప్పిస్తాడనేది చూడాలి.