English   

రవితేజ పెద్ద ఖిలాడీ.. బాబు బాగా బిజీ..

 Ravi Teja
2020-02-27 14:37:28

హిట్ ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా రవితేజ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈయనతో నిర్మాతలు కూడా సినిమాలు నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్క హిట్టు పడితే మళ్లీ మాస్ రాజా కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తాడు. ఆ నమ్మకం అభిమానుల్లో కూడా ఉంది. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న క్రాక్ మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తమిళనాట సంచలన విజయం సాధించిన సేతుపతి సినిమాకు రీమేక్ అని తెలుస్తుంది. బలుపు సినిమా తర్వాత మరోసారి ఈ సినిమాలో శృతి హాసన్.. రవితేజతో జోడీ కట్టింది. కాటమరాయుడు తర్వాత ఈమె నటిస్తున్న తెలుగు సినిమా ఇదే. 

ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు రమేష్ వర్మ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా త్వరలోనే మొదలు కానుంది. ఇందులో పూర్తి స్థాయి మాస్ పాత్రలో నటిస్తున్నాడు మాస్ రాజా. గతంలో ఈ ఇద్దరు వీర అనే సినిమాకు కలిసి పనిచేశారు. అప్పట్లో ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత రమేష్ వర్మతో కలసి ఒక సినిమా చేయబోతున్నాడు రవితేజ. 

గతేడాది బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాక్షసుడు సినిమా తెరకెక్కించాడు. బాక్సాఫీస్ దగ్గర అది పర్లేదు అనిపించింది. దాంతో మరోసారి ఈ దర్శకుడికి అవకాశం ఇస్తున్నాడు రవితేజ. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు ఖిలాడి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇందులో రవితేజ క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుందని.. గత సినిమాలతో పోలిస్తే కొత్తగా ఉండబోతోందని నమ్మకంగా చెబుతున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. కచ్చితంగా ఈ రెండు సినిమాలతో విజయం అందుకని మళ్లీ తానేంటో చూపిస్తానని అంటున్నాడు మాస్ రాజా. మరి ఈ నమ్మకాన్ని ఖిలాడి, క్రాక్ సినిమాలు ఎంతవరకు నిలబడతాయో చూడాలి.

More Related Stories