English   

జాను ఎఫెక్ట్.. శర్వానంద్ హీరోగా బ్రేక్ తీసుకుంటున్నాడా..

sharwanad
2020-02-29 07:48:20

రెండేళ్ల కింద శర్వానంద్ అంటే సూపర్ సక్సెస్ ఫుల్ హీరో. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కమర్షియల్ హీరోగా తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు శర్వానంద్. అంతకు ముందు కేవలం ఆయన సినిమాలు ప్రశంసల దగ్గర మాత్రమే ఆగిపోయేవి. రన్ రాజా రన్ సినిమా తొలిసారి కమర్షియల్ విజయం అందుకున్న శర్వానంద్ ఆ తర్వాత ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకుని తన రేంజ్ పెంచుకున్నాడు. అయితే ఆ తర్వాత మాత్రం మళ్లీ ఒక్కసారిగా వెనుకబడిపోయాడు. శర్వానంద్ నటించిన సినిమాలు గత రెండేళ్లుగా వరుసగా పరాజయాల పాలవుతున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో వచ్చిన రణరంగం, జాను సినిమాలు శర్వానంద్ ను దారుణంగా మోసం చేశాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేయడంతో శర్వానంద్ మార్కెట్ కూడా బాగానే పడిపోయింది. దాంతో కొన్ని రోజులు పూర్తిగా బ్రేక్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. ఈ మధ్య సమంత అక్కినేని హీరోయిన్ గా నటించిన జాను సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. పైగా ఈ సినిమాను దిల్ రాజు నిర్మించడంతో కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన నమ్మాడు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జాను తెలుగులో డిజాస్టర్ అయ్యింది. తమిళంలో చరిత్ర సృష్టించిన ఈ సినిమా తెలుగులో మాత్రం చరిత్రలో కలిసిపోయింది. ప్రస్తుతం శ్రీకారం సినిమాలో నటిస్తున్నాడు శర్వానంద్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే దాదాపు ఆరు నెలల పాటు ఈయన బ్రేక్ తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈయన హీరోగా రామ్ చరణ్ ఒక సినిమా నిర్మించబోతున్నాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ఇప్పటికి ఇప్పుడు ఒక పెద్ద హిట్ కొడితే తప్ప శర్వానంద్ మార్కెట్ మళ్ళీ తిరిగి గాడిన పడదు. మరి ఈ బ్రేక్ ఆయన కెరీర్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

More Related Stories