విక్రమ్ ఏ మాయ చేస్తున్నాడ్రా బాబూ.. కోబ్రా అంటూ కొత్తగా..

ఒక్కసారి స్టార్ హీరో అనే ముద్ర పడితే చాలు.. మాస్ ఇమేజ్ ఉంటే చాలు.. ఎన్ని ప్లాపులు వచ్చినా ఆ ఇమేజే వాళ్లకు శ్రీరామరక్ష. అనుమానం ఉంటే చూడండి.. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు ఏళ్లపాటు విజయాలు లేకపోయినా కూడా వరసగా సినిమాలు వస్తుంటాయి. దానికి కారణం మాస్ ఇమేజే. ఇప్పుడు విక్రమ్ మరోసారి ఇది నిరూపిస్తున్నాడు. ఈ హీరోకు ఇప్పుడు కమర్షియల్ సినిమాలు కలిసి రావట్లేదు.. పేరు తెచ్చిన ప్రయోగాలు బెడిసికొట్టాయి.. మాస్ సినిమాలు హ్యాండిచ్చాయి.
ఇలాంటి టైమ్ లో ఎలాంటి సినిమా చేయాలో తెలియక తెగ హైరానా పడిపోయాడు విక్రమ్. చివరికి ఎలాగోలా ధైర్యం చేసి.. తనకు అచ్చొచ్చిన దారిలోనే వెళ్తున్నాడు ఈ హీరో. మరోసారి ప్రయోగాల బాటలోనే నడుస్తున్నాడు. శంకర్ తో చేసిన ప్రయోగం ఐ బెడిసి కొట్టినా.. ఇరుముగన్ తో పర్లేదనిపించాడు. మొన్నొచ్చిన స్కెచ్ కూడా డిజాస్టరే. మొన్న వచ్చిన సామి 2 కూడా ఫ్లాపే. ఆ తర్వాత కమల్ హాసన్ నిర్మించిన మిస్టర్ కేకే ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా తెలియదు. ఇన్ని ఫ్లాపులు వస్తున్నా.. విక్రమ్ కెరీర్ పై మాత్రం అవి పెద్దగా ప్రభావం చూపిస్తున్నట్లు కనిపించట్లేదు. స్కెచ్ కూడా తేడా కొట్టినా.. ఇప్పటికీ విక్రమ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి.
భారీ అంచనాలతో వచ్చిన గౌతమ్ మీనన్ ధృవనక్షత్రం కూడా డిజాస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు ఈయన. ప్రస్తుతం అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్న కోబ్రాలో నటిస్తున్నాడు విక్రమ్. ఇందులో కమల్ మాదిరే దశావతారంలో కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు విక్రమ్. ఆ మధ్య మహావీర్ కర్ణ అనే సినిమా కమిటయ్యాడు విక్రమ్. 300 కోట్లతో ఈ చిత్రం తెరకెక్కనుంది. మళయాల దర్శకుడు ఆర్ఎస్ విమల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు ముహూర్తం పెట్టారు దర్శక నిర్మాతలు. మొత్తానికి వరసగా ఫ్లాపులు వస్తున్నా కూడా విక్రమ్ కెరీర్ మాత్రం ఇప్పటికీ పరుగులు పెడుతూనే ఉంది.