English   

విజయ్ దేవరకొండపై డిస్ట్రిబ్యూటర్ల తిరుగుబాటు..

World Famous Lover
2020-02-29 17:07:03

కెరీర్ లో గోల్డెన్ టైమ్ అనేది కొన్ని రోజులు మాత్రమే నడుస్తుంది. అన్ని రోజులు తమదే అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా లాంటి వరుస విజయాలతో ఇండస్ట్రీలో చాలా వేగంగా సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. కానీ ఎంత వేగంగా తెచ్చుకున్నాడో అంతే వేగంగా ఇప్పుడు తన మార్కెట్ పోగొట్టుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. 

ఈ మధ్యే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను కొని నష్టపోయిన బయ్యర్లు తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ లో విజయ్ దేవరకొండకు వ్యతిరేకంగా ఫిర్యాదు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. క్రాంతి మాధవ్ తెరకెక్కించిన వరల్డ్ ఫేమస్ లవర్ కొన్ని రోజుల కిందట విడుదలై డిజాస్టర్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 18 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది ఈ సినిమా. దాంతో తమను ఎలాగైనా విజయ్ దేవరకొండ ఆదుకోవాలంటూ డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయం గురించి మాట్లాడటానికి వస్తే విజయ్ కనీసం అపాయింట్ మెంట్ కూడ ఇవ్వకపోవడం డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీనితో ఈ డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చిన ఫిర్యాదును తీసుకుని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఈ సినిమా నిర్మాత రామారావును పిలిపించి అడిగితే.. డిస్ట్రిబ్యూటర్లకు ఎంతోకొంత సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండ ఏ మాత్రం సహకరించడం లేదనే విషయాన్ని ఆయన బయట పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో అసహనానికి లోనైన తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెద్దలు ప్రస్తుతం విజయ్ దేవరకొండ త ఫైటర్ సినిమా తెరకెక్కిస్తున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ కు చిన్న సైజు వార్నింగ్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. 

విజయ్ దేవరకొండ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఫైటర్ సినిమా సమయంలో కచ్చితంగా ఇబ్బందులు తప్పవని ఆయనకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో బయ్యర్లు తీసుకోకుండా ఆంక్షలు విధిస్తామని ఘాటుగా మెసేజ్ పెట్టినట్లు కొందరు చెబుతున్న మాట. ఇవన్నీ చూసిన తర్వాత విజయ్ దేవరకొండతో తాను మాట్లాడతానని పూరీ డిస్ట్రిబ్యూటర్లకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరస ప్లాపులతో విజయ్ దేవరకొండ మార్కెట్ భారీగా పడిపోయింది. ఇలాంటి సమయంలో ఈ లేనిపోని తిప్పలు చూసి ఆయన టెన్షన్ పడుతున్నాడు. ఇంత జరుగుతున్నా విజయ్ దేవరకొండ మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ఉన్నాడని తెలుస్తోంది. 

More Related Stories