English   

బాబోయ్ రవితేజ మరో సినిమా.. త్రినాథరావు నక్కినతో మాస్ ఎంటర్టైనర్..

rt
2020-02-29 21:06:22

ఫ్లాపుల్లో ఉన్నాడనే మాటే కానీ రవితేజ కెరీర్ మాత్రం చాలా జోరు మీద ఉంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న క్రాక్ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మే 8 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా మొదలు పెట్టాడు రవితేజ. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన వీర సినిమా డిజాస్టర్ అయింది. అయినా కూడా రమేష్ వర్మ చెప్పిన కథ నచ్చి ఇప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చాడు మాస్ రాజా. ఈ సినిమా కూడా 2020లోనే విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో మూడు కథలు కూడా విన్నాడు రవితేజ. అందులోనే ఇప్పుడు మరో దర్శకుడికి కూడా ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఇప్పుడు రవితేజ నటించబోతున్నాడు. ఈ కాంబినేషన్ లో పక్కా మాస్ ఎంటర్ టైనర్ రాబోతుందని తెలుస్తోంది.

ఇప్పటికే రవితేజ ఇమేజ్ కు సరిపోయేలా రైటర్ ప్రసన్న కుమార్ ఒక కథ సిద్ధం చేశాడు. సాధారణంగా త్రినాథరావు సినిమాలకు ప్రసన్న కథ మాటలు రాస్తూ ఉంటాడు. వీళ్ల గత సినిమా హలో గురు ప్రేమకోసమే యావరేజ్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు రవితేజ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు త్రినాథరావు నక్కిన. మొన్నటి వరకు ఆయన వెంకటేష్ తో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా ప్రస్తుతానికి వాయిదా పడడంతో రవితేజపై ఫోకస్ పెట్టాడు ఈ దర్శకుడు. మరోవైపు రవితేజకు కూడా ఈ సినిమా కీలకంగా మారింది. వరుస పరాజయాలు వస్తున్న కూడా తన ఇమేజ్ తో అవకాశాలు దక్కించుకుంటున్నాడు మాస్ రాజా. కానీ హిట్స్ రాకపోతే మాత్రం రవితేజకు మున్ముందు మరింత కష్టకాలం తప్పదు.

More Related Stories