ఆచార్యగా మెగాస్టార్.. మళ్లీ నోరు జారిన చిరంజీవి..

ఏదో ఒక్కసారి చేస్తే పొరపాటు.. మరోసారి చేస్తే గ్రహపాటు.. కానీ ప్రతీసారి చేస్తూ పోతే అది అలవాటు. ఇప్పుడు చిరంజీవికి మూడోది వచ్చింది. తన పర బేధం లేకుండా అన్నిచోట్లా నోరు జారుతున్నాడు మెగాస్టార్. ఇదే ఇప్పుడు అక్కడున్న వాళ్లతో పాటు సినిమా యూనిట్ కు కూడా లేనిపోని ఇబ్బందులు తీసుకొస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా నటించిన ఓ పిట్ట కథ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా టైటిల్ చెప్పేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాకు టైటిల్ ఏంటి అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతుంది.
ఇలాంటి సమయంలో సింపుల్ గా ఈయన ఆచార్య అంటూ నోరు జారాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య.. అంటూ నాలిక కరుచుకున్నాడు మెగాస్టార్. ఆ తర్వాత టైటిల్ చెప్పేసానా అంటూ పక్కనే ఉన్న బ్రహ్మాజీ వైపు చూశాడు. ఈ సినిమా టైటిల్ కోసం ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాం పెట్టి అందులో అనౌన్స్ చేద్దాం అనుకుంటే చిరంజీవి మాత్రం నోరు జారాడు. ఆ తర్వాత కొరటాల శివకు సారీ చెప్పాడు. అయితే ఎంత సారీ చెప్పిన కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
చిరంజీవి ఇలా నోరు జారడం ఇదే మొదటిసారి కాదు. అప్పట్లో గీత గోవిందం సక్సెస్ మీట్ కు వచ్చిన మెగాస్టార్.. సినిమా విడుదలైన ఐదు రోజులకే కథ మొత్తం చెప్పేసాడు. సినిమాను మలుపు తిప్పే సన్నివేశం గురించి కూడా అలా చెప్పేస్తే పాపం అక్కడే ఉన్న విజయ్ దేవరకొండ బిత్తరపోయి చూసాడు. చేసేదేం లేక అల్లు అరవింద్ వైపు చూస్తే.. ఆయనేదో సర్ది చెప్పాడు. గతంలో రంగస్థలం ఆడియో వేడుకలో కూడా రిలీజ్ కు ముందే క్లైమాక్స్ లో ఆది చచ్చిపోతాడని చెప్పేసాడు చిరంజీవి. ఆయన తెలిసి తెలియక చేస్తోన్న చిన్న పొరపాట్లు సినిమాలపై ప్రభావం చూపించకపోతే చాలు..! ఎందుకంటే ఆయనంటే ఉన్న గౌరవంతో కనీసం ఒక్కరు కూడా కన్నెత్తి చూడరు.. పన్నెత్తి మాట్లాడరు. ఈ విషయం చిరు కూడా కాస్త అర్థం చేసుకోవాలి మరి..! ఇప్పుడు తన సినిమా టైటిల్ గురించి కూడా ఇలాగే నోరుజారి దర్శక నిర్మాతలకు షాక్ ఇచ్చాడు.