English   

కరోనా దెబ్బకు ఖాళీ అవుతున్న థియేటర్స్..

virus
2020-03-04 20:09:18

మూలిగే నక్కపై తాటిపండు పడటం అంటే ఇదే కాబోలు. అసలే థియేటర్స్ అన్నీ కలెక్షన్స్ లేక వెలవెలబోతున్నాయి. ఈ మధ్యే హిట్, భీష్మ లాంటి సినిమాలు రావడంతో కాస్త కళ వచ్చింది. అంతలోనే ఇప్పుడు కరోనా కూడా వచ్చేసింది. ఇన్నాళ్ళూ ఇండియాకు బయట మాత్రమే ఉన్న ఈ వైరస్ ఇప్పుడు తెలంగాణ వరకు కూడా వచ్చేసింది. హైదరాబాద్ మెట్రో సిటీ కావడంతో ఇక్కడ అందరిలోనూ భయం మొదలైపోయింది. ముఖ్యంగా కరోనా వైరస్ అంటే వణికిపోతున్నారిప్పుడు. అందుకే ఎక్కడికి బయటకి కూడా కాలు మోపడం లేదు. ముఖ్యంగా సినిమాలకు అయితే పూర్తిగా సెలవిచ్చేసారు ప్రేక్షకులు. బతికుంటే మళ్లీ చూసుకోవచ్చు అంటూ అటు వైపు వెళ్లడమే మానేసారు. దాంతో థియేటర్స్ అన్నీ ఒక్కసారిగా ఖాళీ అయిపోయాయి. భీష్మ, హిట్ లాంటి సినిమాలకు టాక్ బాగున్నా కూడా బయట పరిస్థితులు బాగోలేక కలెక్షన్స్ రావడం లేదు. నానాటికి కరోనా అనుమానిత కేసులు పెరిగిపోతుండటంతో అస్సలు అటువైపు వెళ్లడం లేదు ఆడియన్స్. దాంతో కలెక్షన్లకు భారీగానే కోత పడుతుంది. కొందరు నిర్మాతలైతే తమ సినిమా విడుదల తేదీలను వాయిదా వేసుకుంటున్నారు. తర్వాత విడుదల చేయాలనుకుంటున్నారు. కరోనా భయం పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాతే సినిమాలకు వెళ్లాలని ఆడియన్స్ కూడా మెంటల్ గా ఫిక్సైపోయారు. దాంతో బాక్సాఫీస్ పూర్తిగా గాడి తప్పింది. ఈ వారం ఓ పిట్టకథ, అనుకున్నదొక్కటి అయినదొక్కటి, పలాస 1978తో పాటు మరో మూడు నాలుగు సినిమాలు కూడా విడుదల కానున్నాయి. మరి వీటి పరిస్థితి ఎలా ఉండబోతుందో..?

More Related Stories