English   

విజయ్, అల్లు అర్జున్ ఏం తింటారో మరి..

vijay
2020-03-05 07:18:08

ఇండియాలో ఎంతమంది హీరోలున్నా కూడా హాలీవుడ్ హంక్ మాత్రం ఎప్పటికీ హృతిక్‌ రోషన్‌ ఒక్కడే. ఈయన చూడ్డానికి బాలీవుడ్ కాదు హాలీవుడ్ నుంచి ఇప్పుడే దిగుమతి అయిన గ్రీకువీరుడిలా ఉంటాడు. ఇప్పటికీ కూడా ఈయనంటే పడి చచ్చిపోతుంటారు అమ్మాయిలు. ఇదిలా ఉంటే ఈయన మంచి నటుడే కాదు అద్భుతమైన డాన్సర్ కూడా. ఇండియాలోని హీరోల్లో నెంబర్ వన్ డాన్సర్ ఈయనే అనడంలో సందేహం కూడా లేదు. అలాంటి హీరో ఇప్పుడు దక్షిణాది స్టార్స్‌ గురించి మాట్లాడాడు. అందులోనూ మరీ ప్రత్యేకంగా అల్లు అర్జున్‌.. తమిళ హీరో విజయ్‌ డ్యాన్స్‌లను మెచ్చుకున్నాడు హృతిక్. వాళ్లేం తింటారో అంటూ సరదాగా సెటైర్లు కూడా వేసాడు ఈయన. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది సినిమాల గురించి చెప్పుకొచ్చాడు ఈ బాలీవుడ్ సూపర్ స్టార్. గతేడాది వరకు వరస ఫ్లాపుల్లో ఉన్న ఈయన.. వార్ సినిమాతో మళ్లీ రేసులోకి వచ్చాడు. గతంలో ఈయనకు బ్యాంగ్ బ్యాంగ్ లాంటి హిట్ ఇచ్చిన సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన వార్ సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు దక్షిణాది సినిమాలతో పాటు ఇక్కడి హీరోల గురించి చెప్పుకొచ్చాడు ఈయన.

ఈ మధ్య విడుదలైన ఒక్క సౌత్ సినిమాను కూడా చూడలేదని చెప్పుకొచ్చాడు ఈయన. అయితే ఇక్కడి సినిమాల్లో టెక్నాలజీని వాడే తీరుకు తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు హృతిక్. దాన్ని చూసి బాలీవుడ్ కూడా నేర్చుకోవాలంటున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే డ్యాన్స్‌ చేయడానికి ఎంతో సాధన అవసరమని చెప్పిన ఈ హీరో.. ఆస్వాదిస్తూ డ్యాన్స్‌ చేయాలని సూచించాడు. ముఖ్యంగా నువ్వు ఎంత మంచి నటుడు అనేది మొహంలోనే తెలుస్తుందని చెప్పాడు ఈ హీరో. అల్లు అర్జున్‌ డ్యాన్స్‌ గురించి అడగ్గా.. ఆయన చాలా మంది స్పూర్థినిచ్చాడు అంటూ సమాధానం చెప్పాడు. విజయ్‌ గురించి అడగగా.. నాకు తెలిసి వీళ్ళు రహస్యంగా ఏదో తింటున్నారు.. ఎందుకంటే రోజూ అదే ఉత్సాహంతో ఉంటారు.. డ్యాన్స్‌కు ముందు వీళ్లు ఏం తింటారో తెలుసుకోవాలని ఉందంటూ సరదాగా కామెంట్ చేసాడు హృతిక్‌ రోషన్. ప్రస్తుతం ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

 

More Related Stories