English   

సౌత్‌లో ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్ ఎవరో తెలుసా...

 Akkineni Nagarjuna
2020-03-05 14:21:42

పాన్ ఇండియా అని ఈ మధ్య చాలా వింటున్నాం. అంటే మన భాషలో సినిమా విడుదల చేస్తే అన్ని భాషల్లోనూ అది కలెక్షన్లు వసూలు చేయడం అన్నమాట. కేజియఫ్, బాహుబలి మాత్రమే పాన్ ఇండియన్ సినిమాలు అయ్యాయి. ఆ తర్వాత సాహో, సైరా లాంటి సినిమాలు వచ్చినా కూడా ఎందుకో కానీ అవి ఒకచోటే వర్కవుట్ అయ్యాయి. అయితే ఇప్పుడిప్పుడు మనం ఈ పాన్ ఇండియన్ సినిమాలు.. పాన్ ఇండియన్ స్టార్స్ అంటున్నాం కానీ 90ల్లోనే ఈ స్టేటస్ అందుకున్న హీరో ఒకరున్నారు.. ఆయనే నాగార్జున. 

రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు పాన్ ఇండియన్ సినిమాలు చేసారు కానీ మార్కెట్ విషయంలో మాత్రం అంతగా సత్తా చూపించలేదు. ఇప్పుడు ప్రభాస్, యశ్ మాత్రమే కాస్త పర్లేదనిపిస్తున్నారు. కానీ సౌత్ ఇండియాలో మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ స్టేటస్ చూసిన హీరో నాగార్జున. ఈయన సినిమాలు 90ల్లోనే సంచలనాలు సృష్టించాయి. 1989లో విడుదలైన శివ సినిమాతో తెలుగు, హిందీ, తమిళ అన్ని భాషల్లోనూ సంచలన విజయం అందుకున్నాడు ఈయన. ఈ సినిమాతో ఆయనకు యుపి, బీహార్ లాంటి రాష్ట్రాలలో కూడా నాగ్ కి ఫాన్స్ వచ్చారు. 1990 తర్వాత నాగార్జున పేరు అన్ని ఇండస్ట్రీలలో వినిపించింది. ఆ తర్వాత ఆయన నటించిన చైతన్య, జైత్రయాత్ర, కిల్లర్, అంతం ఇలా అన్ని సినిమాలు ఇండియా వైడ్ గా విడుదలయ్యాయి. 

అప్పట్లోనే ఇండియాలో 50 లక్షలు పారితోషికం తీసుకోవడమే ఎక్కువ అంటే శాంతి క్రాంతి మూవీకి 75 లక్షలు తీసుకున్నాడు నాగార్జున. అప్పట్లో అమితాబ్ బచ్చన్ కంటే కూడా అది ఎక్కువ రెమ్యునరేషన్. ఆ తర్వాత కూడా ఈయన నటించిన రక్షకుడు సినిమా ముందు తమిళనాడులోనే విడుదలైంది. ఆ తర్వాత దాన్ని తెలుగులో అనువదించారు. అలా తెలుగులో మొదటి పాన్ ఇండియన్ స్టార్ నాగార్జున. వెంకటేష్, చిరంజీవి లాంటి వాళ్లు కూడా అప్పుడప్పుడూ హిందీ సినిమాలు చేసారు కానీ వాళ్లు అక్కడ గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ నాగార్జున మాత్రం అలా కాదు. ఇప్పుడు కూడా ఆయన రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాలో ఓ హీరోగా నటిస్తున్నాడు. కరణ్ జోహార్ దీనికి నిర్మాత. 

More Related Stories