English   

రాహుల్ సిప్లిగంజ్ కంటే ముందు సినిమా వాళ్లపై కొన్ని అటాక్స్..

Rahul Sipligunj
2020-03-05 17:10:07

బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై జరిగిన దాడి ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి తనపై చేయి చేసుకున్నాడంటూ రాహుల్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఇదిలా ఉంటే దీనికి ముందు కూడా కొందరు సినిమా వాళ్లపై అప్పుడప్పుడూ దాడులు జరుగుతూ వచ్చాయి. అవి ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో జరిగాయో చూద్దాం.

1. రాహుల్ సిప్లిగంజ్:

తన స్నేహితులతో ఓ పబ్‌కు వెళ్లిన రాహుల్‌ను అక్కడ కొందరు టార్గెట్ చేసి చేయి చేసుకున్నారు. ఆయనను రక్తలు వచ్చేలా కొట్టారు. తలపై బీర్ బాటిల్స్ కూడా పగలగొట్టారు. ఇప్పుడు ఈ గొడవకు గల కారణమేంటి అనేది చాలా రకాలుగా వినిపిస్తున్నా కూడా అక్కడ జరిగిన ఓ చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారిందని తెలుస్తుంది. ఆయనతో పాటు ఓ ప్రముఖ టీవీ ఛానెల్ యాంకర్ కూడా ఉంది.

2. జబర్దస్త్ వినోద్:

జబర్దస్త్ వినోద్‌పై జరిగిన దాడి కూడా అప్పట్లో సంచలనంగా మారింది. ఆయనపై ఇంటి ఓనర్ దాడి చేసాడు. ఈయన జరిగిన దాడి ఆర్థికపరమైనదే. 10 లక్షల విషయంలో తనపై దాడి చేసారని వినోద్ పోలీసులకు తెలిపాడు.

3. కత్తి మహేష్:

ఎప్పుడూ వివాదాస్పద కామెంట్స్‌తో వార్తల్లో ఉండే కత్తి మహేష్‌ను ఇప్పటికే రెండుమూడు సార్లు అటాక్ చేసారు కొందరు వ్యక్తులు. ఓ సారి పవన్ అభిమానులు గుడ్లతో దాడి చేసారు. ఆ తర్వాత మొన్నటికి మొన్న రాముడిపై ఇష్టమొచ్చిన కామెంట్స్ చేసాడని ఓ సినిమాకు వచ్చిన ఆయనపై కారు ఆపి మరీ దాడి చేసారు హిందుత్వ వాదులు.

4. శ్రీ రెడ్డి:

తెలుగు సినిమా పెద్దలతో పాటు చాలా మంది నటీనటులపై వివాదాస్పద కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డిని ఇప్పటికే చాలా మంది చాలాసార్లు టార్గెట్ చేసారు. అయితే గతేడాది మార్చ్‌లో ఈమె ఇంట్లో ఉన్న సమయంలో చెన్నైలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శ్రీ రెడ్డిపై దాడి చేసారు. ఆ వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

5. జబర్దస్త్ వేణు:

జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ వేణుపై అప్పట్లో గౌడ సామాజిక వర్గం దాడులు చేసింది. కళ్లుగీత కార్మికులను కించపరిచేలా ఓ స్కిట్ చేసాడని ఈయన్ని ఫిల్మ్ ఛాంబర్ సమీపంలో పరిగెత్తించి మరీ కొట్టారు గౌడ నేతలు. అప్పట్లో ఈ దాడి సంచలనంగా మారింది. ఆ తర్వాతే ఆయన జబర్దస్త్ వదిలేసాడు.

6. పద్మావత్:

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన అద్భుతమైన దృశ్యకావ్యం పద్మావత్. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు కర్ణిసేన వ్యక్తులు ఈ సినిమా యూనిట్‌పై దాడి చేయడమే కాకుండా కోట్ల రూపాయల ఆస్తిని కూడా ధ్వంసం చేసారు. సినిమాను ఆపేయాలని అప్పట్లో చాలా ఒత్తిళ్లు తీసుకొచ్చారు.

7. ఖలేజా సినిమా సెట్స్:

తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న సమయంలో తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు భారీగానే నష్టపోయాయి. ఆ సమయంలో అందరికంటే ఖలేజా సినిమా నిర్మాతలే ఎక్కువగా నష్టపోయారు. అప్పట్లో భారీ సెట్ ఒకటి తగలబెట్టారు తెలంగాణ ఉద్యమ నేతలు. అప్పట్లో అది సంచలన దాడి. ఆ తర్వాత కూడా ఆర్య 2, అదుర్స్, సలీమ్ లాంటి సినిమాలు తెలంగాణ హీట్ ఎదుర్కొన్నాయి.

8. రాజశేఖర్:

చిరంజీవి రాజకీయాల్లో పనికిరాడు.. ఆయనకు అనుభవం లేదు.. నేను ఆయనకు ఓటు వేయనన్నందుకు హీరో రాజశేఖర్‌పై దాడి చేసారు చిరంజీవి అభిమానులు. 2008లో జరిగిన ఈ ఘటన తెలుగు సినిమాలో సంచలనం. ఆ తర్వాత రాజశేఖర్ ఇంటికి వెళ్లి మరి సారీ చెప్పాడు మెగాస్టార్. ఇలా సినిమా వాళ్లపై జరిగిన కొన్ని దాడులు ఇండస్ట్రీలో కలకలం రేపాయి.

More Related Stories