English   

తమ్మారెడ్డి భరద్వాజ్ దళితులపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు..

Tammareddy
2020-03-08 08:05:40

తమ్మారెడ్డి భరద్వాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసాడు. మొన్నటికి మొన్న మూడు రాజధానుల విషయంపై ఈయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇక ఇఫ్పుడు ఈయన సమర్పకుడిగా ఉన్న పలాస 1978 సినిమా గురించి మరోసారి ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు తమ్మారెడ్డి. మంచి సినిమాలు కావాలి.. మంచి రివ్యూలు రావాలి అంటారు. అలా వచ్చిన పలాస 1978 సినిమాకు కలెక్షన్లు రావడం లేదు అంటున్నాడు ఈయన. దళితుల పాత్రలు  సినిమాల్లో ఉండవని.. దళిత కథలు సినిమాగా మారవు అంటారు కానీ పలాసలో వాళ్లను హీరోలుగా చూపించామని చెప్పాడు ఈయన. వాళ్లు పడే సమస్యలను చర్చించామని తెలిపాడు తమ్మారెడ్డి. కానీ వాళ్ల నుంచే ఈ రోజు స్పందన రావడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు తమ్మారెడ్డి. మీ సినిమాలు మీరు కూడా చూడకపోతే మీ ఖర్మ.. మీరు చూసి ఆశీర్వదిస్తే.. మరిన్ని సినిమాలు వస్తాయి.. ఇది నా ఆవేదన.. నా 40 ఏళ్ల కెరీర్ లో ఏ సినిమా ఆడినా ఆడకపోయినా బాధ పడలేదు కానీ పలాస 1978 విషయంలో మేము సక్సెస్ అయ్యాం కానీ ఈ సినిమా మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత దళితులదే అంటూ కామెంట్ చేసాడు ఈ దర్శక నిర్మాత.  
దీనిపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ‘‘ఇది మరీ విడ్డూరంగా ఉంది. దళితుల సమస్యల గురించి సినిమా తీశాం.. అందుకే వారు పట్టించుకోవాలనడం.. ఓ వైపు ఇది పూర్తిగా కమర్షియల్ సినిమా అంటూ చెప్పుకుంటున్నారు. మరోవైపు దళితులే ఈ సినిమా చూడాలంటూ ఆర్డర్స్ వేస్తున్నారు. భరద్వాజ గారి కామెంట్ పూర్తిగా అసంబద్ధంగా ఉంది. సినిమా విడుదలకు ముందే ఇదే మాట ఎందుకు ఎక్కడా చెప్పుకోలేకపోయారు. సినిమా బానే ఉంది. ఆ యాంగిల్ లో మాట్లాడొచ్చు. ‘‘ పలాస లో వారి పాత్రలను హీరోలను చేసాము.. వారి సమస్యలను చర్చించాము.. కానీ వారి నుండే స్పందన కరువైంది. మీ సినిమాలు మీరు కూడా చూడకపోతే మీ ఖర్మ’’ అనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. మీ సినిమాను ఎవరూ పట్టించుకోకపోతే చివరికి ఆ తప్పు దళితుల మీద నెట్టివేస్తారా..? ఇలాంటి కమెంట్స్ సినిమాకు మేలు చేస్తాయా కీడు చేస్తాయా.. ? అయినా ఇవాళ మీరు తీసిన ఒక్క సినిమాతో దళిత చైతన్యం పెరిగిపోతుందనుకుంటున్నారా లేక ఇప్పటి వరకూ దళితుల్లో చైతన్యమే లేదని స్టేట్మెంట్ ఇస్తున్నారా భరద్వాజ గారు అంటూ ఆయనపై మండి పడుతున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమాను మోసింది.. మోస్తున్నది కూడా దళితులే.. అయినా వాళ్లే ఎప్పుడూ టార్గెట్ గా కనిపించడం.. అభ్యుదయ వాదిని అని చెప్పుకునే భరద్వాజ అవగాహనా రాహిత్యానికి అద్దం పడుతోందంటూ వాళ్లు కామెంట్ చేస్తున్నారు.

More Related Stories