English   

సిధ్ శ్రీరామ్.. సెన్సేషన్ ఆఫ్ టాలీవుడ్..

sriram
2020-03-08 15:49:08

అమృతం గొంతులో పోస్తే ఎంత మధురంగా ఉంటుందో తెలియదు కానీ.. ఆయన పాట వింటే మాత్రం అలాగే ఉంటుంది. నిజంగానే ఆ బ్రహ్మదేవుడు అతడి గొంతులో అమృతం కానీ పోసాడేమో అనిపిస్తుంది. ఆయన పాట వింటే చాలు ఏదో మాయ.. ఇప్పుడు తెలుగులో ఆ ఒక్కడి కోసం దర్శక నిర్మాతలు, సంగీత దర్శకులు వేచి చూస్తున్నారు. అతడే సిధ్ శ్రీరామ్. రెండు మూడేళ్లుగా సిధ్ పాడిన ప్రతీ పాట సంచలనమే. అన్నీ అద్భుతాలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో మగువ మగువ పాటతో మరోసారి మాయ చేస్తున్నాడు ఈయన. ఉమెన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ పాట దూసుకుపోతుంది.

1. నువ్వుంటే నా జతగా.. ఐ:
విక్రమ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ఐ సినిమాలో తొలిసారి తెలుగులో సిధ్ శ్రీరామ్ వాయిస్ మాయ చేసింది. ఆ సినిమాలో నువ్వుంటే నా జతగా సాంగ్ అప్పట్లో సంచలనమే. డబ్బింగ్ పాటే అయినా కూడా సంచలనం సృష్టించింది ఈ పాట.

2. వెళ్లిపోమాకే.. సాహసం శ్వాసగా సాగిపో:
నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన సినిమా సాహసం శ్వాసగా సాగిపో.. ఈ సినిమాలో వెళ్లిపోమాకే పాట ఇప్పటికీ సంచలనమే.

3. ఇంకేం కావాలి.. గీత గోవిందం:
విజయ్ దేవరకొండ హీరోగా పరుశురామ్ తెరకెక్కించిన గీత గోవిందం సినిమాలో ఇంకేం ఇంకేం కావాలి పాట అప్పుడు ఇప్పుడు సంచలనమే. సిధ్ శ్రీరామ్ ఈ పాటతో స్టార్ అయిపోయాడు.

4. అడిగా అడిగా.. నిన్నుకోరి:
నాని హీరోగా నిన్నుకోరిలోని అడిగా అడిగా పాట అయితే రెండేళ్ల పాటు సంచలనాలు రేపింది.

5. ఉండిపోరాదే.. హుషారు:
చిన్న సినిమాలకు సిధ్ శ్రీరామ్ పాటలు సేవియర్ అవుతున్నాయి. హుషారులో కూడా ఉండిపోరాదే పాట కూడా ఇప్పటికీ సంచలనమే. ఈ పాట కోటి వ్యూస్ దక్కించుకుంది.

6. మాటే వినదుగా.. టాక్సీవాలా:
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కించిన ఈ సినిమాలో మాటే వినదుగా సాంగ్ కూడా సంచలన విజయం సాధించింది. ఈ పాట యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించింది.

7. ఏమైపోయావే.. పడిపడి లేచే మనసు:
శర్వానంద్, సాయి పల్లవి జంటగా వచ్చిన పడిపడి లేచే మనసు సినిమాలోని ఏమై పోయావే పాట కూడా బాగా పాపులర్ అయింది. విషాద గీతంగా దీనికి మంచి పేరు వచ్చింది.

8. మెల్లమెల్లగా.. ఏబిసిడి:
అల్లు శిరీష్ పాటలు పెద్దగా క్లిక్ కావు. కానీ సిధ్ శ్రీరామ్ పాడిన మెల్లగా మెల్లగా సాంగ్ మాత్రం మంచి ప్రజాదరణ పొందింది. ఏబీసీడిలోని ఈ పాట సంచలనం రేపింది.

9. అరెరే మనసా.. ఫలక్‌నుమా దాస్:
విశ్వక్ సేన్ హీరోగా ఆయనే తెరకెక్కించిన సినిమా ఫలక్‌నుమా దాస్. ఇందులోని అరెరె మనసా చాలా మంది ఫోన్స్ రింగ్ టోన్ కూడా అయిపోయింది.

10. కడలల్లే.. డియర్ కామ్రేడ్:
కడలల్లే వేచే మనసే.. అంటూ ఏడాది కింద డియర్ కామ్రేడ్ పాట దుమ్ము దులిపేసింది.

11. నిను చూసే ఆనందంలో.. గ్యాంగ్ లీడర్:
అడిగా అడిగా అంటూ నానికి మంచి పాట ఇచ్చిన సిధ్ శ్రీరామ్.. గ్యాంగ్ లీడర్‌లో రెండు పాటలు పాడాడు. అయితే అందులో నిను చూసే ఆనందంలో సాంగ్ అయితే పిచ్చెక్కించింది.

12. సామజవరగమనా.. అల వైకుంఠపురములో:
నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాపై అప్పటి వరకు ఉన్న అంచనాలను డబుల్ చేసిన పాట సామజవరగమనా. ఈ పాట ఇప్పటికీ అందరి నోళ్లలో నానుతూనే ఉంటుంది. 100 మిలియన్ వ్యూస్ దక్కించుకుని సంచలనాలు సృష్టించింది ఈ పాట.

13. నీలినీలి ఆకాశం.. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా:
యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన సినిమా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? ఈ సినిమా గురించి ప్రేక్షకులకు తెలిసేలా చేసిన సినిమా మాత్రం నీలినీలి ఆకాశం పాటే. దీన్ని కూడా సిధ్ శ్రీరామ్ పాడాడు.

14. మనసా మనసా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్:
అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలోని మనసా మనసా పాట కూడా యూ ట్యూబ్‌లో బాగానే వెళ్తుంది.

More Related Stories