English   

కరోనా ఎఫెక్ట్ తో బయటపడదాం అంటే షాకిచ్చారు

corona
2020-03-09 07:25:38

కరోనా పేరు చెబితే అందరూ హడలిపోతున్నారు. ఈ వైరస్‌ బారిన పడకుండా జనం ఎవరికి వారుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాని మోడీ, ఇతర కేంద్ర కేబినెట్‌ మంత్రులు హోలీ వేడుకలను సైతం రద్దు చేసుకున్నారు. బహిరంగ సభలను క్యాన్సిల్‌ చేశారు. భారీగా జన సందోహం ఒకేచోట ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేప్టటారు. ఒక్క సభలకే కాదు.. సినిమా థియేటర్లకు కూడా జనం పెద్దసంఖ్యలోనే వస్తారు. కరోనా సోకకుండా ఉండాలంటే...థియేటర్లకు వచ్చే వారి పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది. దీంతో వీక్షకుల క్షేమం కోసం అంటూ సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక నలుగురు పెద్దలు ఒక ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రపోజల్‌పై సినీ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది.

కరోనా వల్ల షూటింగ్‌లతోపాటు థియేటర్లను కూడా నాలుగు వారాలపాటు మూసివేద్దామని ప్రతిపాదించారట ఆ నలుగురు. ఇదే విషయాన్ని ఫిల్మ్‌ ఛాంబర్‌, నిర్మాతల మండలికి తెలియజేశారు. సమస్య చూస్తే ఆందోళనకరంగా ఉంది. ఏం చేద్దాం అని ఈ రెండు సంస్థలకు చెందిన పెద్దలు ఒక మీటింగ్‌ పెట్టుకుని చర్చించారు. సుదీర్ఘ సమాలోచనల తర్వాత ఆ నలుగురి ప్రతిపాదనను తిరస్కరిస్తూ ఫిల్మ్‌ చాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ జాయింట్‌గా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం సినీ వర్గాలను ఆశ్చర్య పరిస్తే.. ఆ నలుగురికి షాక్‌కు గురిచేసిందట. వాస్తవానికి ఆ నలుగురు అంటే సినిమా ఇండస్ట్రీ... సినిమా ఇండస్ట్రీ అంటే ఆ నలుగురు అనే ముద్ర ఉంది. అలాంటి కీలక వ్యక్తులు నాలుగు వారాల పాటు థియేటర్లు మూసివేద్దాం అని అంటే ఫిల్మ్‌ చాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్ నో చెప్పాయట.

మాల్స్‌, మల్టిప్లెక్స్‌ల సంగతి పక్కన పెడితే.. సినిమాల పరంగా ఈ కాలం అన్‌సీజన్‌గా  భావిస్తారు. విద్యార్థులకు పరీక్షల కాలం కావడంతో పెద్దగా ఎవరూ థియేటర్లకు రారు. అలాగే పెద్ద సినిమాలు ఏవీ విడుదల కావు. అంతేకాకుండా చాలా థియేటర్లలో చిన్న సినిమాలే ఆడతాయి. పెద్దగా కలెక్షన్లు కూడా ఉండవు. మెయింటినెన్స్‌కు కూడా డబ్బులు రావు. అయినప్పటికీ ఆ నలుగురు లీజు తీసుకున్న థియేటర్లకు ఒప్పందం ప్రకారం రెంట్స్‌ కట్టాల్సి ఉంటుంది. అదే థియేటర్లు మూసివేస్తే రెంట్‌ కట్టాల్సి పని ఉండదు. అందుకే కరోనా పేరు చెప్పి నాలుగు వారాల పాటు థియేటర్ల మూసివేతకు ప్రతిపాదన చేశారట ఆ నలుగురు. అయితే దీని వెనుక అసలు విషయాన్ని పసిగట్టి వారు అందుకు ఒప్పుకోలేదని అంటున్నారు.

 

More Related Stories