English   

చిరంజీవి లేకుంటే ఈపాటికే చచ్చిపోయే వాడిని..

 Prudhvi Raj
2020-03-09 18:11:33

30 ఇయర్స్ పృథ్వీ.. ఈ పేరుకు ఇండస్ట్రీలో కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇప్పుడు మరింత ఎక్కువగా ఈయన పేరు వినిపిస్తుంది. రాజకీయాల్లో ఉండటంతో 30 ఇయర్స్ పృథ్వీ పేరు బలంగా మారుతుంది. పైగా రూలింగ్ పార్టీ వైసీపీలో ఉండటం.. ఎస్వీబీసి ఛైర్మన్ కావడంతో మనోడు బాగా పాపులర్ అయిపోయాడు. అయితే ఇప్పుడు ఉన్న పదవి కూడా ఊడిపోయింది. దానికి కారణం 30 ఇయర్స్ పృథ్వీ చేసిన కొన్ని తెరచాటు పనులంటూ ఆడియో టేపులు బయటికి రావడం సంచలనంగా మారుతుంది. 

ముఖ్యంగా ఓ ఉద్యోగినితో ఈయన అసభ్య పదజాలంతో మాట్లాడాడంటూ ఓ ఆడియో బయటికి రావడం.. అది తనది కాదంటూ 30 ఇయర్స్ పృథ్వీ చెప్పడం సంచలనంగా మారుతున్నాయి. నిజానిజాలు విజులెన్స్ అధికారులు తేల్చేస్తారంటూ.. అది నా వాయిస్ కాదంటూ చెబుతున్నాడు ఈయన. కానీ సీఎం జగన్ మాత్రం అంత టైమ్ ఇవ్వలేదు.. వెంటనే ఈయన్ని ఎస్వీబీసి ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ ఆదేశించాడు.. ఈయన చేసాడు కూడా. అయితే ఈ సంఘటన తర్వాత తనతో అందరూ మాట్లాడటం మానేశారని బాధపడుతున్నాడు పృథ్వి.  అప్పటి వరకు తన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఇప్పటివరకు ఫోన్ చేయలేదని ఆయన గుర్తు చేసుకున్నాడు. అలాంటి సమయంలో  తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు చెప్పాడు ఈ కమెడియన్. 

ఇలాంటి పరిస్థితుల్లో తనకు చిరంజీవి అండగా నిలబడ్డాడని.. కాస్త వాడి గురించి ఆలోచించండి అంటూ ఇండస్ట్రీలో వాళ్లకు చెప్పినట్లు ఈయన తెలియజేశాడు. ఈరోజు కాక బతుకుతున్నాను అంటే దానికి కారణం చిరంజీవి అని చెప్పాడు  ఈ నటుడు. ఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నా కూడా చిరంజీవి గొప్పవాడు అని చెబుతున్నాడు పృథ్వి. ఈయన పేరు కాంట్రవర్సీల్లో రావడం ఇదే తొలిసారి కాదు. టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి తెలియకుండా ఈయన 30 ఉద్యోగాలు తిరుమలలో ఎవరెవరికో ఇచ్చాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజానికి సినిమాల్లో ఉన్నపుడు కూడా 30 ఇయర్స్ పృథ్వీ సంచలనమే. 30 ఇయర్స్ అంటూ నిజంగానే 30 ఏళ్లకు పైగానే తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడు. 

అప్పుడెప్పుడో 80వ దశకంలోనే టాలీవుడ్ కు వచ్చాడు ఈయన. కానీ బ్రేక్ రావడానికి కాస్త ఎక్కువ సమయం పట్టిందంతే. అప్పట్లోనే ఖడ్గం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నా కూడా స్టార్ కమెడియన్ కావడానికి చాలా టైమ్ పట్టేసింది. లౌక్యం తర్వాత మనోడి దశ మారిపోయింది. అప్పట్నుంచి తిరుగులేని కమెడియన్ అయిపోయాడు. మూడు నాలుగేళ్ల పాటు గ్యాప్ లేకుండా సినిమాలు చేసాడు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ నానా హంగామా చేసాడు ఈయన.

ఇదిలా ఉంటే ఈయన ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం కూడా ఇప్పుడు నిందను ఒప్పుకోవడమే అంటున్నాయి ప్రతిపక్షాలు. ఈయన రాజీనామాతో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఛానెల్లో వివాదానికి ముగింపు పలికినట్టైంది. తన రాజీనామా విషయాన్ని విలేకరుల సమావేశంలో పృథ్వీ స్వయంగా ప్రకటించాడు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆయన ప్రకటించాడు. తాను ఎస్వీబీసీ చైర్మన్‌గా 2019 జూలై 28న ప్రమాణం స్వీకారం చేశానని.. తనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపాడు. 

తనను దెబ్బతీయడం కోసమే కొందరు కుట్రలు చేసినట్టు ఉందన్నారు. నకిలీ వాయిస్‌ పెట్టి తనపై దుష్ప్రచారం చేశారన్నాడు. తాను మద్యం మానేసి చాలా కాలమైందన్నాడు.. పద్మావతి అమ్మవారి పవిత్ర స్థలంలో మందు తాగుతున్నట్టు చెడు ప్రచారం చేసారన్నాడు. వైద్యులతో తనకు పరీక్షలు చేసినా సిద్ధమే అన్నాడు. ఎప్పటికైనా తన నిజాయితీ నిరూపించుకుంటానని చెబుతున్నాడు పృథ్వి. మొత్తానికి ఏం చేసినా కూడా ఈయన వివాదాలకు కేంద్రబిందువుగా మారడం నిజంగానే సంచలనంగా మారుతుంది. 

More Related Stories