పూరీ సాయంతో దర్శకురాలిగా మారిన నటి కళ్యాణి..

తెలుగుతో పాటు సౌత్ అన్ని భాషల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ కళ్యాణి. ఒకప్పుడు జగపతిబాబు, వెంకటేష్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించింది ఈమె. కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్న కళ్యాణి.. ఇప్పుడు దర్శకురాలిగా మారింది. తాజాగా ఈమె తొలి సినిమా ఫస్ట్ లుక్ ఇప్పుడు పూరీ జగన్నాథ్ విడుదల చేసాడు.
హోలీ సందర్భంగా ఈ సినిమా లుక్ విడుదల చేసాడు ఈయన. అనేక సూపర్ హిట్ సినిమాల్లో నాయికగా నటించి, తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి కల్యాణి ఈ సినిమాకు దర్శకురాలిగానే కాకుండా నిర్మాతగా కూడా ఉంది. ఈ మధ్య ఎక్కువగా అతిథి పాత్రలు మాత్రమే చేస్తూ వస్తున్న ఈమె ఇప్పుడు దర్శకురాలిగా మారింది. ఆమె కే2కే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా విలక్షణ ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా కల్యాణి తీస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా సిద్ధమవుతుంది.
ఈ సినిమా ప్రి లుక్, టీజర్ గ్లింప్స్‌ను హోలీ సందర్భంగా డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేసాడు. చేతన్ శీను, సిద్ది, సుహాసినీ మణిరత్నం,రోహిత్ మురళి, శ్వేత ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. బాలనటిగా కెరీర్ ఆరంభించిన కల్యాణి.. 1986 నుంచి సినిమాల్లో నటిస్తూ వస్తుంది. తనకున్న అనుభవంతో ఇప్పుడు నిర్మాతగా, దర్శకురాలిగా మారింది.