English   

లావణ్య త్రిపాఠికి కేవలం అలాంటి పాత్రలే కావాలంట..

lav
2020-03-09 19:56:56

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది అందమైన అభినయం ఉన్న హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి కూడా ఉంటుంది. అందాల రాక్షసితో వచ్చిన ఈమె ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసింది. అయితే కోరుకున్న స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు. విజయాలు కూడా ఉన్నాయి కానీ స్టార్ హీరోయిన్ హోదా మాత్రం ఇంకా రాలేదు. అయితే కొన్నాళ్లుగా లావణ్య ఎంచుకుంటున్న కథల్లో మార్పు వచ్చింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటిస్తుంది ఈమె. అసంబద్ధమైన చిత్రాల్లో నటించడం కంటే ఖాళీగా ఇంట్లో ఉండటానికి ఇష్టపడే లావణ్యా త్రిపాఠికి ఇప్పుడు తెలుగు, తమిళ భాషలలో ఆసక్తికరమైన పాత్రలు వస్తున్నాయి. ఆమెకు స్క్రిప్ట్‌ నచ్చితే... ఆ సినిమా కోసం ఎంతైనా కష్టపడటానికి రెడీ అంటుంది. తన వంద శాతం ఇస్తానంటుంది ఈ బ్యూటీ. ఒక్కసారి కమిట్ అయితే ఎంత కష్టమైనా పడతానని చెబుతుంది లావణ్య. ఇటీవల దక్షిణాది సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక, కొన్ని బాలీవుడ్ సినిమాలను ఆమె వదులుకుంది.

తెలుగులో 'అర్జున్ సురవరం' విజయం తర్వాత 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌'లో లావణ్యా త్రిపాఠి నటిస్తుంది. ఇందులో సందీప్ కిషన్ హీరో. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో ఆమెది హాకీ క్రీడాకారిణి పాత్ర. సినిమా కోసం కొన్ని రోజులు హాకీలో శిక్షణ తీసుకుంది కూడా. ఈ సినిమాతో పాటు తెలుగులో కార్తికేయ సరసన 'చావు కబురు చల్లగా' సినిమాలో నటిస్తుంది. 'భలే భలే మగాడివోయ్', 'శ్రీరస్తు శుభమస్తు' విజయాల తర్వాత ప్రముఖ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్ లో ఆమెకు హ్యాట్రిక్ సినిమా అది. తమిళంలో అథర్వ కథానాయకుడిగా కొరటాల శివ శిష్యుడు రవీంద్ర మాధవ దర్శకత్వంలో మైఖేల్‌ రాయప్పన్‌ ఓ సినిమా నిర్మిస్తున్నారు. అందులో లావణ్యా త్రిపాఠి కథానాయిక. అందంతో పాటు అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్ర అని తెలిసింది. లావణ్యా త్రిపాఠి అయితేనే  పాత్రకు న్యాయం చేస్తుందని దర్శక నిర్మాతలు భావించి, ఆమెను తీసుకున్నారు. మొత్తానికి వరస సినిమాలతో స్టార్ హీరోయిన్ కావడానికి అడుగులేస్తుంది లావణ్య.

More Related Stories