English   

చిరంజీవి సినిమాలో మహేష్ బాబు ఉన్నాడా లేదా.. ఏంటి కన్ఫ్యూజన్..

Mahesh Chiru.jpg
2020-03-10 10:27:21

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. కొన్ని రోజులుగా రామోజీ ఫిలిం సిటీలోనే ఆచార్య కోసం ప్రత్యేకంగా భారీ సెట్ ఒకటి నిర్మించారు. అందులోనే గత నెల రోజులుగా షూటింగ్ చేస్తున్నాడు కొరటాల శివ. మరో 15 రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ అక్కడే జరగనుంది. ఇప్పటికే దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తి చేశాడు దర్శకుడు కొరటాల శివ. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు ఈ దర్శకుడు. ఇక ఇందులో చిరంజీవి కాసేపు నక్సలైట్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. దాంతోపాటే దేవాదాయ శాఖలో జరిగే అన్యాయాల గురించి కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాడు కొరటాల శివ.

ఇదిలా ఉంటే ఆచార్య సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై సూపర్ స్టార్ కూడా ఓకే చెప్పాడని.. కొరటాల శివ చెప్పిన కథ నచ్చడంతో అతిథి పాత్రలో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చిరంజీవికి కూడా చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మహేష్ బాబు పాత్రపై మెగాస్టార్ ఆలోచనలో ఉన్నాడని.. ఈ సినిమాలో ఆయనను తీసుకోవాలా లేదా అని మరోసారి ఆలోచనలో పడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి ప్రత్యేకంగా కారణాలు ఏమీ కనిపించడం లేదు. ఈ సినిమా కోసం 30 రోజులు డేట్స్ ఇచ్చిన మహేష్ బాబు 30 కోట్ల రెమ్యూనరేషన్ కూడా అడిగాడు. దాంతో ఇంత భారీగా పారితోషికం ఇవ్వడం చిరంజీవికి నచ్చడం లేదని తెలుస్తోంది. అందుకే ఈ పాత్రను రామ్ చరణ్ చేస్తే బాగుంటుందని మెగాస్టార్ భావిస్తున్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్న సమాచారం.

అయితే మెగాస్టార్, సూపర్ స్టార్ కలిస్తే వచ్చే మల్టీస్టారర్ కు క్రేజ్ ఆకాశమంత ఉంటుంది. జరిగే బిజినెస్ కూడా అలాగే ఉంటుంది. దానికి తోడు కొరటాల శివ తనకు మహేష్ బాబు కావాలి అని పట్టుబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రస్తుతం చిరంజీవి ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నాడు. కొన్ని రోజుల్లోనే ఈ సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నాడా లేదా అనేది క్లారిటీ రానుంది. అప్పటివరకు ఈ సస్పెన్స్ తప్పదు. మరోవైపు చిరంజీవి సినిమా కోసం దర్శకుడు పరశురామ్ వెయిటింగ్ లిస్టులో పెట్టాడు సూపర్ స్టార్.

More Related Stories