ధరమ్ తేజ దేవా కట్టా సినిమాని లాంచ్ చేసిన పవన్ కళ్యాణ్

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ కిషోర్ తిరుమల చిత్రలహరితో మళ్లీ ట్రాక్ పడ్డాడు. అదే జోష్ లో గత ఏడాది డిసెంబర్ లో మారుతి ప్రతిరోజు పండగేతో మరో హిట్ కొట్టి మార్కెట్ లో నిలబడ్డాడు. అయితే ఈసారి ఆయన నటిస్తున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్. ఈ సినిమాతో సుబ్బు అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 1న విడుదల కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే మనోడు మరో సినిమా ఒప్పుకున్నాడు. అది కూడా ప్రస్థానంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న దేవా కట్టాతో.
ఈ సినిమాని ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంచ్ చేశారు. ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఈరోజు లాంచ్ అయింది ఈ సినిమా. ఈ కార్యక్రమానికి పవన్ తో పాటుగా భోగవల్లి ప్రసాద్, వంశీ పైడిపల్లి కూడా పాల్గొన్నారు. ఈ సినిమాలో నివేదా పెతురాజ్ ధరమ్ తేజ్ సరసన నటించనున్నారు. చాలా రోజులుగా సక్సెస్ లేక సైలెంట్ అయిన భగవాన్ పుల్లారావులు ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా ఏప్రిల్ నెల నుండి షూట్ కి వెళ్లనుంది. ఇక పవన్ ఈ వేడుకకు హాజరవడంతో ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ఈ విషయం మీద మాట్లాడానికి మాటలు రావడం లేదని, అందరికీ ధన్యవాదాలు తెలిపారు.