English   

భీష్మ మీద కేసు...నెల రోజులకి మెలుకువ వచ్చిందట 

Nithiin Bheeshma
2020-03-14 10:30:38

ఈ మధ్య సినిమాలు తీసేవారికి భయమేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏం తీస్తే ఎవరి మనోభావాలు హర్ట్ అవుతాయో అని భయపడే రోజులు వచ్చేశాయి. కొన్ని విషయాల్లో ఈ మనోభావాల విషయంలో నిజాయితీ ఉన్నా, కొన్ని చోట్ల మాత్రం కావాలని కలిపించుకుని మరీ వివాదాలు చేస్తున్నారు. ఆ మధ్య వరుణ్ తేజ్ వాల్మీకి టైటిల్ వివాదం, హీరో విజయ్ `బిగిల్` పోస్టర్ ఇలా రకరకాల వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. 

అయితే ఈ మధ్య ఇలాంటి వ్యవహారాలు ఎక్కడా లేవు అనుకుంటున్నా తరుణంలో మేమున్నాం అంటూ ఒకరు బయటకొచ్చారు. అది కూడా సినిమా రిలీజయు దాదాపు నెల రోజులు కావొస్తున్న తరుణంలో. అసలు విషయానికి వెళితే నితిన్ రశ్మిక జంటగా వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ గత నెల 21 న విడుదల కావడం తెలిసిందే. ఈ సినిమాతో చాల రోజులకి నితిన్ హిట్ అందుకున్నాడు. అయితే పరీక్షల సీజన్ కావడమే కాక మరోపక్క కరోనా భయాలతో భీష్మ బ్లాక్ బస్టర్ కాకుండా హిట్ వరకే ఆగింది. అయితేనేమి భీష్మ కొన్న బయ్యర్లు అందతూ హ్యాపీ. అయితే భీష్మ రిలీజయిన ఇన్నాళ్ళకి భీష్మ సినిమా మీద కొంతమంది హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఫైల్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. 

తాజాగా భీష్మ సినిమా పై గంగపుత్రుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తెలంగాణ హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేసాడు. భీష్మ సినిమాలోని కొన్ని సీన్స్ తమ కులం వారిని కించపరిచేలా ఉన్నాయని, ఆ సీన్స్ మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వెంటనే అలాంటి సన్నివేశాలను సినిమా నుండి నుంచి వెంటనే తొలిగించాలని కంప్లైంట్ చేశారు. దీని మీద హెచ్ఆర్సీ ఎలా స్పందిస్తుందో చూడాలి. అయినా నెల రోజుల తర్వాత వీళ్ళకి మెలుకువ వచ్చిందా ? అని ప్రశ్నిస్తున్నారు కొందరు.

More Related Stories