English   

పాన్ ఇండియా తర్వాత.. ముందు తెలుగులో హిట్ కొట్టి చూపించు..

Vijay Devarakonda
2020-03-16 16:20:12

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ ఇలాంటి సెటైర్లు పడుతున్నాయి. రెండేళ్ల కింద ఇమేజ్ వేరు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో వరుస విజయాలు అందుకుని తెలుగులో సూపర్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. కానీ ఎంత వేగంగా పైకి వచ్చాడో.. అంతే వేగంగా పడిపోయాడు. భారీ అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు. ఈ సమయంలో ఈయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది. హిందీలో ఈ సినిమాను కరణ్ జోహార్ విడుదల చేస్తున్నాడు. కచ్చితంగా ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తాను మళ్లీ హిట్ కొట్టి చూపిస్తాను అంటూ శపథం చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. పూరి జగన్నాథ్ సినిమా అన్ని భాషల్లో విడుదలవుతుంది కాబట్టి తర్వాత సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే కావాలని విజయ్ తన దగ్గరికి వస్తున్న నిర్మాతలను అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఈయన కోరిక విని నిర్మాతలు పారిపోతున్నారని ప్రచారం జరుగుతోంది.

 పూరి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకి ఓ సినిమా చేయాలి. ఆ నిర్మాతలను విజయ్ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాని నిర్మించమని అడుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల కింద అంటే ఓకే కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ అంత మార్కెట్ లేదని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే పాన్ ఇండియా స్థాయిలో సినిమా అంటే వాళ్లు కూడా ఆలోచిస్తున్నారు. అందుకే ముందు ఇక్కడ సినిమాలు చేసి విజయం అందుకున్న తర్వాత ఇతర భాషల గురించి ఆలోచిద్దాం అంటూ విజయ్ దేవరకొండకు నిర్మాతలు సర్ది చెబుతున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ తో సాహో సినిమాలో నిర్మించిన యూవీ క్రియేషన్స్ ను కూడా విజయ్ దేవరకొండ ఒక పాన్ ఇండియా సినిమా కోసం అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ముందు తెలుగులో హిట్ కొట్టి చూపించు ఆ తర్వాత పాన్ ఇండియా గురించి ఆలోచిద్దాం అంటూ నిర్మాతలు చెబుతున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఏం చేయాలన్నా కూడా పూరి జగన్నాథ్ ఫైటర్ సినిమా హిట్ కావాల్సిందే. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన కెరీర్ ఈ సినిమాపై ఆధారపడి ఉంది. మరి ఇలాంటి సమయంలో పూరి జగన్నాథ్ ఏం చేస్తాడో చూడాలి. 

More Related Stories