రాజమౌళి నెక్ట్స్ ఏం చేయబోతున్నాడో తెలుసా..

బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి ఏం చేస్తాడనే దానికి ఊహించని సమాధానం ఇచ్చాడు ఈయన. అంతకంటే పెద్ద సినిమా ఇంకేం చేస్తాడులే అనుకుంటున్న తరుణంలో తెలుగు ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చేస్తున్నాడు దర్శకధీరుడు. ఒకేసారి రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్స్ ను తీసుకొచ్చి సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు RRR సినిమా షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. దాంతో ఇప్పుడు నెక్ట్స్ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు విజువల్ ఎఫెక్ట్స్ వాడుకోవాలంటే ఇప్పుడు ఇండియాలో రాజమౌళి తర్వాతే ఎవరైనా..! బాలీవుడ్ దర్శకులు కూడా ఇప్పుడు రాజమౌళితో క్లాసులు చెప్పించుకోడానికి వస్తున్నారు. అలాంటి దర్శకుడు ఆర్ఆర్ఆర్ తర్వాత నెక్ట్స్ ఏ సినిమా చేస్తాడో.. ఎలాంటి సినిమా చేస్తాడో అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. పైగా విజువల్ ఎఫెక్ట్స్.. కెమెరా ట్రిక్స్.. సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఇప్పుడు రాజమౌళి అవపోసన పట్టాడు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాజమౌళి నెక్ట్స్ సినిమా మాత్రం గ్రాఫిక్స్ లేని చిన్న సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
బాహుబలి తర్వాత కూడా ఇలాంటి సినిమానే చేస్తానని చెప్పి చివరికి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. ఇప్పుడు మరోసారి ఇవేవీ లేకుండా తర్వాతి సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆయన తీరు చూస్తుంటే ఇది సాధ్యమేనా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయంపైనే ఆలోచిస్తున్నాడు దర్శక ధీరుడు. త్వరలోనే తర్వాతి సినిమాపై క్లారిటీ ఇవ్వనున్నాడు జక్కన్న. ఇప్పటికే తండ్రి విజయేంద్రప్రసాద్ కథ కూడా సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. హీరో ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాకపోయినా.. ఈయన తర్వాతి సినిమా మాత్రం చిన్న హీరోతోనే ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. మగధీర తర్వాత మర్యాద రామన్న తరహాలోనే ఇది ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది.