English   

కరోనాను పక్కనబెట్టి లవ్ స్టోరీ నడిపిస్తున్న శేఖర్ కమ్ముల..

corona
2020-03-17 19:37:15

కరోనా వైరస్ కారణంగా చాలా వరకు సినిమాలు వాయిదా పడ్డాయి.. తెలుగు సినిమా నిర్మాతలంతా కూర్చుని మాట్లాడుకుని కొన్ని రోజులు షూటింగ్స్ వాయిదా కూడా వేసారు. అయితే కొందరు మాత్రం కరోనా భయం ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. అందులో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా కూడా ఉంది. ఫిదా సినిమా తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుని ఈయన చేస్తున్న సినిమా ఇది. దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ మధ్యే ఏయ్ పిల్లా పాట కూడా వచ్చింది. ఈ ఒక్క పాటతో ఇప్పుడు లవ్ స్టోరీ రేంజ్ పెంచేసాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. అందులో ఏ పిల్లా అంటూ మరోసారి మాయ చేసింది సాయి పల్లవి. ముఖ్యంగా చైతూను ముద్దు పెట్టే సీన్ అయితే అదుర్స్ అంతే. ప్రేమకథలతో పాటు తనకు నచ్చిన కథలను హృద్యంగా తెరకెక్కిస్తుంటాడు శేఖర్. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా మొదలైన ఈ చిత్ర షూటింగ్ మరి కొన్ని రోజుల్లో పూర్తి కానుంది. ఇదిలా ఉంటే లవ్ స్టోరీ షూటింగ్ ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో జరుగుతుంది.

అక్కడే నాన్ స్టాప్ షూటింగ్ చేస్తున్నాడు కమ్ముల. కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే షూటింగ్ చేస్తున్నామని చెప్పాడు ఈయన. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. సాయి పల్లవి, చైతూతో పాటు మరికొందరు కీలక నటీనటులు కూడా ఈ షెడ్యూల్ లో ఉన్నారు. ఇప్పటి వరకు రొమాంటిక్ కామెడి, లవ్ స్టోరీ లు ఎక్కువగా చేసాడు.. కానీ తొలిసారి ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. పల్లెటూరి నుంచి వచ్చి జీవితంపై ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చిన ఇద్దరి కథ ఈ సినిమా అంటున్నాడు శేఖర్ కమ్ముల. ముఖ్యంగా ఇందులో నాగ చైతన్య తెలంగాణ కుర్రాడిగా నటిస్తున్నాడని.. ఆ పాత్ర కోసం చాలా కష్టపడుతున్నాడని చెప్పాడు కమ్ముల. ఇక సాయిపల్లవి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మర్ కానుకగా విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను సమ్మర్ అయిపోయిన తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు శేఖర్ కమ్ముల. మొత్తానికి కరోనాకు కూడా భయపడట్లేదు ఈ దర్శకుడు.

More Related Stories