English   

సోది స్టార్‌కు పగిలింది.. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు లావణ్య త్రిపాఠి..

Lavanya tripathi
2020-03-18 11:00:35

యూ ట్యూబ్ పుణ్యమా అని ఎవడు ఎప్పుడు ఎందుకు ఫేమస్ అవుతున్నాడో అర్థం కావడం లేదు. కొన్ని రోజులుగా యూ ట్యూబ్ లో ఎక్కడ చేసినా ఒక్కడే కనిపిస్తున్నాడు. అతడి పేరు సునిశిత్.. మనోడికి శాక్రిఫైజ్ స్టార్, సోది స్టార్, పిచ్చి స్టార్ అంటూ పేర్లు కూడా పెట్టేసారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నాడు.. మహేష్ బాబు లాంటి హీరోను కూడా వాడు వీడు అంటున్నాడు. బాహుబలి నుంచిఅన్ని సినిమాలకు తాను పని చేసానని చెప్తాడు.. అన్నింటికి మించి మహేష్ బాబు '1 నేనొక్కడినే', జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో..' లాంటి సినిమాలు ముందు తనతోనే సుకుమార్ చేయాలనుకుంటే వాళ్లు వచ్చి నన్ను తొక్కేసారంటూ పిచ్చి మాటలన్నీ చెప్పాడు. 

బుల్లితెర యాంకర్ ప్రదీప్ పై కేసు పెట్టి మనోడు ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత హీరో రవితేజ, బన్నీపై కూడా కేసులు కూడా పెట్టానని.. బాహుబలి సినిమాలో పాట పాడానని ఎన్నో కహానీలు చెబుతున్నాడు సునిశిత్. అక్కడి వరకు ఏదో గాలి కబుర్లు చెప్పుంటే బాగుండేది కానీ ఏకంగా హీరోయిన్లతో తనకు ఎఫైర్ ఉందని.. వాళ్లను పెళ్లి చేసుకుని కడుపు కూడా చేసానంటూ చాలా కథలు చెప్పాడు. అందులో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో తను డేటింగ్ చేసానని.. తర్వాత పెళ్లి చేసుకుని విడిపోయామని చెప్పాడు. తర్వాత తమన్నాతో లవ్ లో పడ్డానని చెప్పుకొచ్చాడు ఈ పిచ్చి స్టార్. ఆధారాలు అడిగితే మాత్రం నీళ్లు నములుతాడు. ఈయన చెప్పే సోదిని యూ ట్యూబ్ ఛానెల్స్ అన్నీ ఎంకరేజ్ చేసాయి. ఆ వీడియోలు చివరకు లావణ్య త్రిపాఠి దృష్టికి వెళ్లాయి. 

ఈ క్రమంలోనే ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సునిశిత్ అనే వ్యక్తి తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని తన అసిస్టెంట్ ద్వారా పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు.. లావణ్య ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. ఆడవారిపై అసభ్యంగా మాట్లాడితే జైలుకెళ్లక తప్పదని హెచ్చరించారు. యూట్యూబ్‌ చానెల్స్ లో సునిషిత్ చేసిన వ్యాఖ్యలను పరిశీలించామని.. అతడు ఇతర నటులపైనా కామెంట్స్ చేశారని పేర్కొన్నారు. ఐతే ఇప్పటి వరకు లావణ్య మాత్రమే ఫిర్యాదు చేసారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే కేసు నమోదు చేశామని.. ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. దాంతో పాటు కొన్ని యూ ట్యూబ్ ఛానెల్స్ పై కూడా ఈమె ఫిర్యాదు చేసింది. మొత్తానికి సోది స్టార్‌కు ఇప్పుడు గట్టిగానే పగిలేలా కనిపిస్తుంది. 

More Related Stories