రావయ్యా టాలీవుడ్‌కు.. ప్రశాంత్ నీల్‌కు ఆహ్వానం..

కేజీయఫ్ సినిమాతో తెలుగులో కూడా సత్తా చూపించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. రాజమౌళి బాహుబలి చేస్తే ఆ తర్వాత సౌత్ ఇండియా నుంచి ఈయన ప్యాన్ ఇండియన్ సినిమా చేసి ఔరా అనిపించుకున్నాడు. యశ్ హీరోగా వచ్చిన కేజీయఫ్ గతేడాది సంచలన విజయం సాధించింది. ఒకటి రెండు కాదు.. ఓ కన్నడ సినిమా తొలిసారి 200 కోట్ల మార్క్ అందుకుని చరిత్ర సృష్టించింది. దాంతో ఈయనతో పని చేయాలని చాలా మంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. నిర్మాతలైతే ప్రశాంత్ నీల్‌కు ముందు నుంచే అడ్వాన్సులు కూడా ఇచ్చేస్తున్నారు. పనిలో పనిగా ఈయన తెలుగు ఇండస్ట్రీకి కూడా వచ్చేస్తున్నాడు ఇప్పుడు. ముందు నుంచి చెబుతున్నట్లుగానే ఈయన తెలుగులో ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడు.
అయితే అదెవరో కొన్ని రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్, మహేష్ బాబులలో ఎవరో ఒకరితో ప్రశాంత్ నీల్ సినిమా చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ కూడా ప్రశాంత్ నీల్‌తో తాము సినిమా చేయబోతున్న విషయాన్ని అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసారు. అప్పట్లో ఆయన పుట్టిన రోజు సందర్భంగా విషెస్ విడుదల చేసారు మైత్రి మూవీ మేకర్స్. ప్రస్తుతం కేజీయఫ్ 2తో బిజీగా ఉన్న ఈ దర్శకుడు.. ఆ తర్వాత తెలుగు సినిమా చేయబోతున్నాడు. కెజియఫ్ 2 అక్టోబర్ 23న విడుదల కానుంది. ఆ తర్వాత తెలుగు సినిమాపై ఫోకస్ చేయనున్నాడు ప్రశాంత్. ఎప్పుడు చేసినా కూడా ఈయనకు మాత్రం రెడ్ కార్పెట్ వేసి ఎదురు చూస్తుంది టాలీవుడ్. మరి అదెలా ఉండబోతుందో చూడాలిక.