కాజల్ మనసు బంగారం..ఏం చేసిందంటే

తెలుగులో దర్శకుడు తేజ "లక్ష్మీకల్యాణం'' సినిమాలో పరిచయం చేసిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఆ తరువాత కాజల్ "చందమామ'' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత వరుస ఆఫర్లతో దాదాపు దశాబ్దం పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. చందమామ తరువాత కాజల్‌కు మళ్లీ అంతటి గుర్తింపు తెచ్చిన సినిమా "మగధీర'' ఈ సినిమాతో కాజల్ తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగిపోయింది. తెలుగులో కాజల్ దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. హీరోయిన్గా ఎక్కువ కాలం పరిశ్రమలో ఉండడం అంటే మామూలు విషయం కాదు. కానీ కాజల్ తన నటన, అభినయంతో ఇప్పటికే ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతూనే ఉంది.
అయితే ఈ భామ మనసు కూడా మంచిదే అప్పుడప్పుడూ సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటుంది.
కాగా ప్రస్తుతం కరోనా ప్రతి ఒక్కరినీ కలవర పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ దాటికి దేశ ఆర్థిక వ్యవస్థలే నష్టాల్లోకి మునిగి పోతున్నాయి. ఇక సామాన్యుల పరిస్థితి చెప్పనవసరం లేదు. అయితే కాజల్ ఏదో పనిమీద బయటికి వెళ్తూ క్యాబ్ బుక్ చేసుకుందట. ఆమెతో ప్రయాణిస్తున్న సమయంలో ఆ క్యాబ్ డ్రైవర్ తన బాధను చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు. 48 గంటల నుండి ఎదురు చూస్తున్నాను. కానీ కస్టమర్లు లేరు రెండు రోజుల తరువాత మీరే నా మొదటి కస్టమరని, ఈ రోజు ఇంటికి సరుకులు తీసుకెళతానని చెప్పాడట. దాంతో అతడి కష్టం విని కరిగిపోయిన కాజల్ క్యాబ్ బిల్లు కంటే రూ.500 ఎక్కువే ఇచ్చిందట. ఈ విషయాన్ని కాజల్ తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో పంచుకుంటూ..మీరు కూడా మీరు ప్రయాణించే డ్రైవర్లకు, మీరు సరుకులు తీసుకున్న వ్యాపారులకు కొంత ఎక్కువ డబ్బు ఇవ్వండి ఎందుకంటే మీరే వాళ్లకి చివరి కస్టమర్ అవ్వచ్చు'' అని పోస్ట్ చేసింది. దీంతో కాజల్ మనుసు బంగారం అని ఆమె ఫాలోవర్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కమల్‌హాసన్ సరసన భారతీయుడు-2లో నటిస్తుంది. ఈ సినిమా 2021లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతే కాకుండా సురేష్ ప్రొడక్షన్ "డ్యాన్సింగ్ క్వీన్'' అనే కొరియన్ సినిమాను తెలుగులో రిమేక్ చేయాలని ఆలోచనలో ఉంది. ఈ సినిమాలోనూ కాజల్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.