కరోనా వైరస్ టాలీవుడ్ లో ఆ నలుగురికి మేలే చేసింది

కరోనా వైరస్ దెబ్బ అందరినీ భయపెడుతోంది. ఈ వైరస్ వల్ల సినిమా షూటింగ్లని కూడా క్యాన్సిల్ చేసేశారు. ఇప్పటికే థియేటర్స్ కూడా బంద్ చేయడంతో చాలా సినిమాలు రిలీజ్ కూడా వాయిదా వేసుకుంటున్నారు. అయితే నిజానికి ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకోక ముందే మన తెలుగు ఇండస్ట్రీని శాశించే నలుగురు తీసుకోవాలని అనుకున్నారు. సినిమా థియేటర్లకు కూడా జనం పెద్దసంఖ్యలోనే వస్తారు కాబట్టి కరోనా సోకకుండా ఉండాలంటే థియేటర్లను కూడా బంద్ పెట్టాలని సినిమా పరిశ్రమను ఇప్పుడు లీడ్ చేస్తున్న ఒక నలుగురు పెద్దలు సరిగ్గా పది పదిహేను రోజుల క్రితం ఫిలిం చాంబర్ ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. కరోనా వల్ల షూటింగ్లతోపాటు థియేటర్లను కూడా నాలుగు వారాలపాటు మూసివేద్దామని ప్రతిపాదించారట ఆ నలుగురు. ఇదే విషయాన్ని ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలికి తెలియజేశారు.
సమస్య చూస్తే ఆందోళనకరంగా ఉండడంతో ఈ రెండు సంస్థలకు చెందిన పెద్దలు ఒక మీటింగ్ పెట్టుకుని చర్చించారు. సుదీర్ఘ సమాలోచనల తర్వాత ఆ నలుగురి ప్రతిపాదనను తిరస్కరిస్తూ ఫిల్మ్ చాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అయితే తర్వాత కేసీఆర్ దెబ్బకు భయపడి అదే రెండు కౌన్సిల్స్ సమావేశం అయి ఏకగ్రీవంగా సినిమా హాల్స్ బంద్ ప్రకటించారు. అయితే సినిమాలు వాయిదా పడుతున్నా ఇప్పుడు ఆ నలుగురుకి మంచిదేనని చెబుతున్నారు. ఎందుకంటే మాల్స్, మల్టిప్లెక్స్ల సంగతి పక్కన పెడితే.. సినిమాల పరంగా ఈ కాలం అన్సీజన్గా భావిస్తారు.
విద్యార్థులకు పరీక్షల కాలం కావడంతో పెద్దగా ఎవరూ థియేటర్లకు రారు. అలాగే పెద్ద సినిమాలు ఏవీ విడుదల కావు. అంతేకాకుండా చాలా థియేటర్లలో చిన్న సినిమాలే ఆడతాయి. పెద్దగా కలెక్షన్లు కూడా ఉండవు. మెయింటినెన్స్కు కూడా డబ్బులు రావు. అయినప్పటికీ ఆ నలుగురు లీజు తీసుకున్న థియేటర్లకు ఒప్పందం ప్రకారం రెంట్స్ కట్టాల్సి ఉంటుంది. అదే థియేటర్లు మూసివేస్తే రెంట్ కట్టాల్సి పని ఉండదు. అందుకే కరోనా పేరు చెప్పి నాలుగు వారాల పాటు థియేటర్ల మూసివేతకు ప్రతిపాదన చేశారట. ముందు ఈ నిర్ణయం ఎదురు తిరిగినా దగ్గర దగ్గర నాలుగైదు సినిమాలు వాయిదా పడడంతో కరోనా ఆ నలుగురికీ మేలే చేసిందనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది.