సావిత్రి పాత్రలో నటించిన అనసూయ భరద్వాజ్..

అవును.. నమ్మడం కష్టమే కానీ ఇప్పుడు నిజంగానే అనసూయ ఆ మహానటి పాత్రలో నటించింది. రంగమ్మత్తగా ప్రేక్షకుల మనసు దోచిన ఈమె ఇప్పుడు చాలా విభిన్నమైన పాత్రలు చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మహానటి పాత్రలో కూడా కనిపించింది. యాంకర్ గా ప్రయాణం మొదలు పెట్టి.. నటిగా మారి.. ఇప్పుడు స్టార్ గా ఎదిగే క్రమంలో ఉంది. రంగస్థలంకు ముందు అనసూయ అంటే కేవలం యాంకర్ మాత్రమే. జబర్దస్థ్ నుంచి వచ్చిన ఇమేజ్ తో అప్పుడప్పుడూ సినిమాల్లోనూ కనిపించింది కానీ స్టార్ గా మాత్రం మారలేదు. అయితే రంగస్థలం తర్వాత అనసూయ కోసమే కారెక్టర్లు రాస్తున్నారు దర్శక నిర్మాతలు. ఆ మధ్య క్షణం.. ఆ తర్వాత గాయత్రి సినిమాల్లోనూ మంచి పాత్రలే చేసింది ఈ భామ.
ఇక ఇప్పుడు జీ తెలుగులో ఉగాది ఈవెంట్ కోసం మహానటిగా మారిపోయింది. సావిత్రి జీవితం ఇప్పుడు అందరికి తెరిచిన పుస్తకమే. ముఖ్యంగా కీర్తిసురేష్ ఈ బయోపిక్ లో నటించిన తర్వాత ఈ తరానికి కూడా సావిత్రి అంటే ఏంటి.. ఆ క్రేజ్ ఏంటి అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఇదే ఇమేజ్ తమ ఈవెంట్ కోసం వాడేసుకున్నారు జీ తెలుగు మేనేజ్ మెంట్. ముఖ్యంగా మహానటి జీవితాన్ని మొత్తం చిన్న స్కిట్ రూపంలో చేసారు. అందులో అనసూయ కూడా బాగానే చేసింది. రంగమ్మత్త తర్వాత ఎన్నో భిన్నమైన పాత్రల్లో నటిస్తూ వస్తున్న అను.. ఇప్పుడు ఏకంగా మహానటిగా మారిపోయింది. అప్పట్లో చందన బ్రదర్స్ యాడ్ లో కూడా అహ నా పెళ్లంట అంటూ ఆడిపాడింది అనసూయ. ఇందులో సావిత్రిగా అనసూయ.. ఎస్వీఆర్ పాత్రలో సింగర్ మనో కనిపించారు. ఇప్పుడు జీ తెలుగు కోసం మరోసారి సావిత్రి పాత్రలో నటించింది.