English   

జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి.. వాళ్లకు దిక్కెవ్వరు..

 Coronavirus
2020-03-23 12:39:29

కరోనా వైరస్ కారణంగా తెలుగు ఇండస్ట్రీ కొన్ని రోజులుగా స్తంభించిపోయింది. ఎటువంటి సినిమా షూటింగులు జరగడం లేదు. నిర్మాతల మండలి కూడా దీనిపై సీరియస్ గా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంది. అయితే అంతా బాగానే ఉంది.. కరోనా వైరస్ అరికట్టడానికి సినిమా షూటింగ్ నిలిపివేయడం.. థియేటర్లు మూసేయడం మంచి పని. ఎవరు కాదనడం లేదు.. కానీ ఇక్కడే కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సినిమా షూటింగ్స్ ను ఆపేయటం వల్ల దర్శకులకు హీరోలకు ఎలాంటి నష్టం లేదు. మహా అయితే సినిమా విడుదల వాయిదా పడుతుంది. అంతకంటే వాళ్లకు పెద్దగా నష్టం ఏమీ జరగదు. నిర్మాతలకు మాత్రం కొన్ని కోట్ల నష్టం వస్తుంది కానీ వాళ్లకి కూడా ఏదో ఒకలాగా బయట పడే అవకాశం ఉంటుంది.

కానీ ఇక్కడ కరోనా వైరస్ కారణంగా అకారణంగా నష్టపోతున్నది జూనియర్ ఆర్టిస్టులు.. 24 క్రాఫ్ట్స్ లో పనిచేసే వాళ్లు.. రోజువారి సినీ కార్మికులు.. వాళ్లకు రోజు పని చేసుకుంటే కానీ పూట గడవదు. అలాంటి వాళ్ళు గత వారం రోజులుగా ఎలాంటి పని లేకుండా ఉన్నారు. మరో 15 రోజుల వరకు సినిమా షూటింగ్స్ అన్ని నిలిపేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.. దాంతో వాళ్ళ కష్టాలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. ఏదో ఒక సినిమా షూటింగ్ జరిగితే తప్ప జూనియర్ ఆర్టిస్టులకు డబ్బులు రావు. ఈ సినిమాను నమ్ముకొని థియేటర్లలో పార్కింగ్.. లోపల సమోసాలు అమ్ముకునే వాడు.. క్యాంటీన్ ఓనర్.. చివరికి ఛాయ్ అమ్ముకునే వాడు కూడా బతుకుతుంటాడు. వాళ్ళందరికీ ఒక్కముక్కలో చెప్పాలంటే సినిమా జీవనాధారం.

 ఒక్కరోజు సినిమా ఆగిపోయినా కూడా వాళ్ల బతుకు కూడా ఆగిపోతుంది. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా సినిమాలు ఆపేశారు. దాంతో వాళ్ల బతుకులు కూడా అక్కడే ఆగిపోయాయి. ఆర్థికంగా వాళ్లు మరింత చితికిపోతున్నారు. ఇది ఎవరు కావాలని చేయకపోయినా కూడా సినిమా కార్మికుల జీవితాలపై మాత్రం కరోనా వైరస్ దారుణంగా దెబ్బ కొడుతుంది. వీళ్ళని ఆదుకోవడానికి ఫిలిం ఛాంబర్ ముందుకు వచ్చినా కూడా అందులో కొంత మంది దగ్గర మాత్రమే జూనియర్ ఆర్టిస్ట్ కార్డులు ఉంటాయి. ఇక థియేటర్ లో పని చేసుకునే వాళ్ళ జీవితాలు మరింత దుర్భరంగా ఉంటాయి. ఇలా ఒక్క సినిమాతో చాలామంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. దాంతో ఈ మహమ్మారి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన దేశం నుంచి పారద్రోలాలని అందరూ తీవ్రంగా కృషి చేస్తున్నారు.

More Related Stories