English   

చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య దూరం పెరుగుతుందా...

Allu Aravind Chiranjeevi.jpg
2020-03-23 23:19:20

ఆ అనుమానం ఇప్పుడెందుకు వచ్చింది అనుకుంటున్నారా..? నిజానికి ఈ ఇద్దరి మధ్య ఎప్పుడూ దూరం రాదు. ఎందుకంటే బావ బామ్మర్దుల కంటే కూడా స్నేహితులుగానే ఉంటారు ఈ ఇద్దరూ. అయితే సినిమాల పరంగా మాత్రం బాగా గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు గీతా ఆర్ట్స్ ను తన సొంత బ్యానర్ అనేవాడు చిరంజీవి. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. తనకంటూ సొంత బ్యానర్ పెట్టుకుని అందులో వరస సినిమాలు చేస్తున్నాడు ఈయన.

సాధారణంగా తన సినిమాలకు మాత్రమే పార్టీ ఇచ్చే అల్లు అరవింద్.. ఆ మధ్య సైరా సినిమాకు అందర్నీ పిలిచి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. సరైనోడు లాంటి నెగిటివ్ టాక్ వచ్చిన సినిమా తొలి రోజు నుంచి ప్రమోషన్ చేసి చేసి చివరికి దాన్ని బ్లాక్ బస్టర్ చేసిన ఘనత అల్లు అరవింద్ సొంతం. అలాంటిదిప్పుడు బయట సినిమాకు ఈయన పార్టీ ఇస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి చిత్ర విజయాన్ని అల్లు అరవింద్ సెలబ్రేట్ చేశాడు. అయితే ఉన్నట్టుండి చిరంజీవి సినిమా కోసం పార్టీ ఇవ్వడాన్ని అప్పట్లో అంతా ఆసక్తికరంగా చూసారు కూడా. అల్లు అరవింద్ ఎందుకు ఈ పార్టీ ఇచ్చినట్టు అంటూ ఆరా తీసారు. దీని వెనుక కూడా ఒక కారణం లేకపోలేదు.

ఒకప్పుడు చిరంజీవి గీతా ఆర్ట్స్ లో వరుస సినిమాలు చేశాడు. అల్లు అరవింద్ నిర్మించిన సినిమాల్లో సగానికిపైగా చిరంజీవి హీరోగా నటించినవే. అప్పట్లో సొంత నిర్మాణ సంస్థలా గీతా ఆర్ట్స్ లో సినిమాలు చేసేవాడు మెగాస్టార్. కానీ ఇప్పుడు ఆయన సొంతంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పెట్టుకున్నాడు. రామ్ చరణ్ నిర్మాతగా అందులోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దాంతో ఇప్పుడు చిరంజీవిని ప్రసన్నం చేసుకోవడానికి అరవింద్ పార్టీ ఏర్పాటు చేశాడు అంటున్నారు ఇండస్ట్రీలోని ప్రముఖులు. అల్లు అరవింద్, అశ్వినీదత్ సహా ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది నిర్మాతలు చిరంజీవి డేట్స్ కోసం చూస్తున్నారు. కానీ ఈయన మాత్రం కేవలం తన కొడుకు నిర్మాణంలోనే వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

దాంతో ఆయన డేట్స్ సంపాదించుకోవడానికి ప్రత్యేకంగా సైరా కోసం ఇలా అల్లు అరవింద్ ఒక పార్టీ ఏర్పాటు చేశాడంటూ ఇండస్ట్రీలో అప్పుడు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మెగాస్టార్ తర్వాత సినిమా మైత్రి మూవీ మేకర్స్ తో చేయబోతున్నాడు. మరి అల్లు అరవింద్ నిర్మాణంలో చిరు సినిమా ఎప్పుడు ఉండబోతుందో చూడాలిక.

More Related Stories