English   

ఆచార్య కోసం కొరటాల ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడంటే..

Koratala Siva
2020-03-24 16:32:17

తెలుగు ఇండస్ట్రీలో హీరోలకు బాగా పారితోషికం ఉంటుంది కానీ దర్శకులకు మాత్రం కాదు. ఎవరో రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి వాళ్లే హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇప్పుడు వీళ్లకు పోటీగా కొరటాల శివ కూడా వచ్చేసాడు. రాజమౌళి తర్వాత అపజయం అంటూ ఎరుగని దర్శకుడు ఈయనే. రాజమౌళి అయితే ఇప్పటి వరకు 12 సినిమాలు చేస్తే అన్నీ సక్సెస్ అయ్యాయి. ఇంత సక్సెస్ రేటు దర్శకుడు ఈ మధ్య కాలంలో ఇండియాలో ఎవరూ లేరు. బాహుబలి సినిమాతో క్రేజ్ ఆకాశానికి చేరిపోయింది. ఒక్క సినిమా కోసం వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగిపోయాడు రాజమౌళి. బాహుబలి సినిమాకు ఏకంగా 40 కోట్ల వరకు ఆయన పారితోషికం అందుకున్నాడు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కోసం 100 కోట్లు దాటిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

ఇప్పుడు కొరటాల శివ కూడా రాజమౌళికి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం కొరటాల శివ ఏకంగా 20 నుంచి 25 కోట్ల మధ్య పారితోషికం అందుకుంటున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి అగ్ర దర్శకులు కూడా 15 కోట్ల వరకు తీసుకుంటుంటే కొరటాలకు మాత్రం 25 కోట్లు ఎందుకు అని అనుమానం రావచ్చు. దీని వెనుక చాలా కారణాలున్నాయి. భరత్ అనే నేను సినిమా తర్వాత కొరటాల శివకు బోలెడన్ని ఆఫర్స్ వచ్చాయి. ఈ సినిమా విడుదలై కూడా దాదాపు రెండేళ్లు గడిచిపోయింది. కానీ ఆ అవకాశాలు అన్నీ వదులుకొని చిరంజీవి కోసం కధ సిద్ధం చేసి ఇన్ని రోజులుగా వేచి చూస్తూనే ఉన్నాడు. దాంతో అవన్నీ లెక్క వేసుకొని ఈ సినిమా కోసం కొరటాల శివకు ఏకంగా 25 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఖాళీ సమయాన్ని కూడా మెగాస్టార్ లెక్కకట్టి చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు చిరంజీవితో సినిమా ఓకే అయిన తర్వాత నెల నుంచి ప్రతి నెల దాదాపు 7 లక్షల వరకు కొరటాల శివకు ఖర్చుల నిమిత్తం మెగా కాంపౌండ్ నుంచి వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. అలా రెమ్యూనరేషన్ విషయంలో రాజమౌళి తర్వాత స్థానాన్ని కైవసం చేసుకున్నాడు కొరటాల శివ. చిరంజీవి సినిమా ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ మొదలు కానుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఈయనకు కూడా రోజుకు కోటి చొప్పున 15 రోజులకు 15 కోట్లు మరో నిర్మాత నిరంజన్ రెడ్డి చెల్లించబోతున్నాడని తెలుస్తుంది. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్. దసరాకు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నా కూడా అది కుదిరేలా కనిపించడం లేదు. 

More Related Stories