English   

కరోనా వైరస్ దెబ్బకు నిర్మాతలు బలి.. వాళ్లకు దిక్కెవ్వరు..

 Coronavirus impact
2020-03-26 14:11:14

కరోనా వైరస్ కారణంగా తెలుగు ఇండస్ట్రీ కొన్ని రోజులుగా స్తంభించిపోయింది. ఎటువంటి సినిమా షూటింగులు జరగడం లేదు. నిర్మాతల మండలి కూడా దీనిపై సీరియస్ గా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంది. అయితే అంతా బాగానే ఉంది.. కరోనా వైరస్ అరికట్టడానికి సినిమా షూటింగ్ నిలిపివేయడం.. థియేటర్లు మూసేయడం మంచి పని. ఎవరు కాదనడం లేదు.. కానీ ఇక్కడే కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సినిమా షూటింగ్స్ ను ఆపేయటం వల్ల దర్శకులకు హీరోలకు ఎలాంటి నష్టం లేదు. మహా అయితే సినిమా విడుదల వాయిదా పడుతుంది. అంతకంటే వాళ్లకు పెద్దగా నష్టం ఏమీ జరగదు. నిర్మాతలకు మాత్రం కొన్ని కోట్ల నష్టం వస్తుంది. అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ పూర్తి కావడం లేదు. తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. దాంతో నిర్మాతలకు కంటి మీద కునుకు కరువైంది. 

కొన్ని సినిమాలకు విడుదల తేదీలు మారిపోయాయి.. కొన్ని సినిమాలు అసలు విడుదలవుతాయో లేదో తెలియని పరిస్థితిలోకి వెళ్లిపోయాయి.. మరికొన్ని సినిమాలు ఓపెనింగ్స్ ఆగిపోయాయి.. ఇంకొన్ని సినిమాలు రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి మధ్యలోనే ఆపేశారు.. ఇలా నిర్మాతల కష్టాలు చెప్పుకుంటూపోతే రాస్తే రామాయణం అవుతుంది. అంతగా ఇప్పుడు వాళ్ళ కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే మరో రెండు నెలల వరకు సినిమా షూటింగ్స్ మొదలయ్యేలా కనిపించడం లేదు. దాంతో నిర్మాతల పరిస్థితి తలుచుకుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. సినిమా విడుదల అయినా కాకపోయినా.. షూటింగ్ జరిగినా జరగకపోయినా వాళ్లు తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు అయితే కట్టాల్సిందే. దాంతో తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక  అల్లాడిపోతున్నారు నిర్మాతలు.

వాళ్లతో పాటు ఇక్కడ కరోనా వైరస్ కారణంగా అకారణంగా నష్టపోతున్నది జూనియర్ ఆర్టిస్టులు.. 24 క్రాఫ్ట్స్ లో పనిచేసే వాళ్లు.. రోజువారి సినీ కార్మికులు.. వాళ్లకు రోజు పని చేసుకుంటే కానీ పూట గడవదు. అలాంటి వాళ్ళు గత వారం రోజులుగా ఎలాంటి పని లేకుండా ఉన్నారు. మరో 15 రోజుల వరకు సినిమా షూటింగ్స్ అన్ని నిలిపేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.. దాంతో వాళ్ళ కష్టాలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. ఏదో ఒక సినిమా షూటింగ్ జరిగితే తప్ప జూనియర్ ఆర్టిస్టులకు డబ్బులు రావు. ఈ సినిమాను నమ్ముకొని థియేటర్లలో పార్కింగ్.. లోపల సమోసాలు అమ్ముకునే వాడు.. క్యాంటీన్ ఓనర్.. చివరికి ఛాయ్ అమ్ముకునే వాడు కూడా బతుకుతుంటాడు. వాళ్ళందరికీ ఒక్కముక్కలో చెప్పాలంటే సినిమా జీవనాధారం. ఒక్కరోజు సినిమా ఆగిపోయినా కూడా వాళ్ల బతుకు కూడా ఆగిపోతుంది. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా సినిమాలు ఆపేశారు. దాంతో వాళ్ల బతుకులు కూడా అక్కడే ఆగిపోయాయి. 

ఆర్థికంగా వాళ్లు మరింత చితికిపోతున్నారు. ఇది ఎవరు కావాలని చేయకపోయినా కూడా సినిమా కార్మికుల జీవితాలపై మాత్రం కరోనా వైరస్ దారుణంగా దెబ్బ కొడుతుంది. వీళ్ళని ఆదుకోవడానికి ఫిలిం ఛాంబర్ ముందుకు వచ్చినా కూడా అందులో కొంత మంది దగ్గర మాత్రమే జూనియర్ ఆర్టిస్ట్ కార్డులు ఉంటాయి. ఇక థియేటర్ లో పని చేసుకునే వాళ్ళ జీవితాలు మరింత దుర్భరంగా ఉంటాయి. ఇలా ఒక్క సినిమాతో చాలామంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. దాంతో ఈ మహమ్మారి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన దేశం నుంచి పారద్రోలాలని అందరూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. 

More Related Stories