రాననుకున్నావా.. రాలేననుకున్నావా.. మోహన్ బాబుతో చిరు..

నువ్వు అవునంటే.. నేను కాదంటా.. ఇదే ఇండస్ట్రీలో కొందరి మధ్య నడిచే యవ్వారం. ఇందులో చిరంజీవి-మోహన్ బాబు ముందు వరసలో ఉంటారు. వీళ్లిద్దరూ టామ్ అండ్ జెర్రీ కంటే ఎక్కువే. ఎందుకంటే నిత్యం కలిసున్నట్లే కనిపిస్తారు.. కానీ ఒకరిపై ఒకరు సెటైర్లు వేస్తూనే ఉంటారు. ఈ సెటైర్ల వర్షంలో మోహన్ బాబే కాస్త ముందుంటారు. చిరంజీవి కామ్ గా ఉన్నా.. కావాలని మాటలు తూలుతుంటారు మోహన్ బాబు.
తాజాగా మరోసారి వీళ్ల మధ్య గిల్లికజ్జాలు బయటికి వచ్చాయి. చిరంజీవి ట్విట్టర్ ఎంట్రీ ఇవ్వడంతో మిత్రమా స్వాగతం అంటూ ట్వీట్ చేసాడు మోహన్ బాబు. అది చూసి థ్యాంక్ యూ మిత్రమా అంటూ రిప్లై ఇచ్చి.. వెంటనే రాననుకున్నావా.. రాలేననుకున్నావా అంటూ తనదైన స్టైల్లో డైలాగ్ కొట్టాడు మెగాస్టార్. ఈ విధంగా వీళ్లు సెటైర్లు వేసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఎన్నోసార్లు స్టేజ్ పై చిరు-మోహన్ బాబు సెటైర్లు వేసుకున్నారు. స్వయంగా వజ్రోత్సవాల టైమ్ లో ఇద్దరి మధ్య వివాదం ఏ స్థాయిలో రేగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆ మధ్య శత్రుఘ్న సిన్హా జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభలో ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకున్నారు చిరంజీవి-మోహన్ బాబు. ఇక్కడ కూడా చిరుని ముందుగా కెలికింది మోహన్ బాబే.
శత్రుఘ్న సిన్హాతో తనకున్న అనుబంధం చిరంజీవి పంచుకుంటున్న సమయంలో మధ్యలో మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చాడు. శత్రుఘ్న సిన్హా కెరీర్ కు తన కెరీర్ కు చాలా పోలికలున్నాయి.. ఇద్దరం ప్రతినాయక పాత్రలతోనే కెరీర్ మొదలుపెట్టామంటూ చిరంజీవి చెబుతుంటే.. మధ్యలో మోహన్ బాబు మైక్ అందుకుని అలా ఎలా అవుతుంది.. నువ్వు వేరు శత్రుఘ్న వేరంటూ చెప్పాడు. వీళ్ల మధ్య మాటల సెటైర్లను చూసి అక్కడున్నోళ్ల అలవాటుగా నవ్వుకున్నారు. మొత్తానికి చిరు, మోహన్ బాబు ఈ పేర్లు వింటే చాలు వద్దన్నా టామ్ అండ్ జెర్రీ గుర్తుకు రాక మానదు.