English   

సినిమా కార్మికులకు అండగా మేమున్నాం అంటున్న హీరోలు..

tollywood
2020-03-29 09:45:03

కరోనా వైరస్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని కకావికలం చేస్తుంది. హీరోలు దర్శకులు నిర్మాతలు ఎలాగైనా ఉంటారు.. కానీ రోజూవారీ కూలీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నాయి. వాళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది అంటూ ముందుకు వస్తున్నారు టాలీవుడ్ హీరోలు. మీకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు. 21 రోజుల తర్వాత కూడా మీ అందరికీ మేమున్నాం.. మీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం అంటూ వాళ్ళకు నమ్మకం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధిలకు విరాళం ఇవ్వడమే కాకుండా ప్రత్యేకంగా సినిమా కార్మికుల కోసం కూడా విరాళాలు ప్రకటిస్తున్నారు మన హీరోలు.

ఇప్పటికే నాగార్జున, చిరంజీవి దీని కోసం చెరో కోటి రూపాయలు ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ 25 లక్షలు.. మహేష్ బాబు 25 లక్షలు.. రామ్ చరణ్ 30 లక్షలు.. దర్శకుడు వి వి వినాయక్ ఐదు లక్షలు.. హీరో కార్తికేయ రెండు లక్షలు.. అల్లరి నరేష్ ఐదు లక్షలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సినిమా కార్మికులకు అండగా ఉన్నారు. దాంతోపాటు హీరో రాజశేఖర్ నిత్యవసర వస్తువులు ఇస్తానని హామీ ఇచ్చాడు. నటుడు శివాజీరాజా ఆయన సొంత ఫాంహౌస్లో పండిన కూరగాయలను సినిమా కార్మికులకు ఉచితంగా ఇస్తున్నారు. నిర్మాత సురేష్ బాబు, అల్లు అరవింద్ మరికొందరు సినిమా పెద్దలు కలిసి త్వరలోనే సినిమా కార్మికుల బాగు కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ఆర్థిక సాయం చేయాలని చూస్తున్నారు. మొత్తానికి ఏదైనా జరిగితే కార్మికుల కోసం మేము అండగా నిలబడతానని మన స్టార్ హీరోలు ముందుకు రావడం.. వాళ్ళలో భరోసా కల్పించడం నిజంగానే మెచ్చుకోదగ్గ విషయం.

More Related Stories