అయ్యో పాపం కనికా.. ఐదోసారి కూడా కరోనా పాజిటివ్..

11 రోజుల్లో ఐదు టెస్టులు.. అన్నిసార్లు కరోనా పాజిటివ్.. ఓ మనిషిని అంతకంటే భయపెట్టడానికి మరొకటి ఏముంటుంది చెప్పండి..? ఇప్పుడు బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పరిస్థితి ఇలాగే ఉంది మరి. ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఈమెను అస్సలు వదలడం లేదు. భారత్ లో కరోనా పాజిటివ్ అని తేలిన తొలి బాలీవుడ్ సెలబ్రిటీ కనికా కపూర్. మార్చ్ 9న లండన్ నుంచి ఇండియాకు వచ్చిన ఈమె.. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్లో బస చేసింది. అక్కడే పార్టీలు కూడా చేసుకున్నారు. కరోనా వచ్చిందని తెలిసిన తర్వాత పార్టీలకు వెళ్లడంతో ఆమెపై పోలీసులు కేసు కూడా ఫైల్ చేసారు. ఇదిలా ఉంటే కరోనాతో గత పది రోజులుగా ఈమె ఉత్తరప్రదేశ్లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతుంది. అయినా కూడా ఈమె ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాజాగా మరోసారి ల్యాబ్ కు పంపిన ఆమె సాంపిల్స్ లో మరోసారి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
వరసగా ఐదోసారి కూడా ఈమెకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని రావడంతో ఆశలు కూడా సన్నగిల్లుతున్నాయి. ఇప్పటికే నాలుగు శాంపిళ్ళు పాజిటివ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఐదోసారి కూడా కనికకు పాజిటివ్ వచ్చిందని.. వైద్యానికి ఆమె శరీరం కూడా స్పందించడం లేదని.. దేవుడిని ప్రార్ధించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నామని ఏడుస్తున్నారు కుటుంబ సభ్యులు. సాధారణంగా ఒకటి రెండు సార్లు చేసిన తర్వాత మూడోసారి కరోనా నెగిటివ్ అని వస్తుందంటున్నారు వైద్యులు. కానీ కనికా కపూర్ విషయంలో ఇది జరగడం లేదు. ఇప్పటికీ ఐదుసార్లు పరీక్ష చేస్తే అన్నిసార్లు పాజిటివ్ అని రావడంతో ఏం చేయాలో తెలియక కంగారు పడుతున్నారు కుటుంబ సభ్యులు. మెరుగైన వైద్యం కోసం వెళ్లాలన్నా అమెరికా, ఇటలీ లాంటి దేశాలే కరోనా బారిన పడి విలవిలలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో కనికాను ఎక్కడికి తీసుకెళ్లలేని పరిస్థితి. వైద్యులు కూడా ఇప్పుడే ఏం చెప్పలేమంటున్నారు.