కరోనా విరాళం ప్రకటించిన షారుఖ్ ఖాన్..ఎంతంటే

కరోనా విపత్తులో పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వానికి, సినిమా కార్మికులకి పలువురు స్టార్స్ భారీగా విరాళాలు ఇస్తున్న విషయం తెల్సిందే.ఈ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళంను ప్రకటించిన విషయం తెల్సిందే. ఆయన్ను రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్ బాలీవుడ్లో ఉన్న ఇతర స్టార్ హీరోల మౌనాన్ని మాత్రం సహించడం లేదు. వారిని ఏకి పారేస్తున్నారు. అలాంటి వారిలో షారుఖ్ కూడా ఒకరు. అయితే ఈ నెటిజన్ల తిట్లు విన్నారో లేక ఆయనకే బుద్ధి పుట్టిందో కానీ కరోనాపై పోరాడుతున్న భారత ప్రభుత్వానికి తన వంతు సహకారాన్ని అందివ్వనున్నట్లు షారుఖ్ నిన్న రాత్రి ప్రకటించారు.
తన రెడ్చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, మీర్ ఫౌండేషన్, రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్ సంస్థలతో పాటు కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంఛైజీ తరపున కొన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. అయితే తాను అండగా ఉంటానని ఆయన చెప్పినా ఆ మొత్తం ఎంత అనే దాని మీద అయితే క్లారిటీ లేదు. అది కూడా ఆ మొత్తం ప్రభుత్వానికి ఇస్తారా ? లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకి నేరుగా ఇస్తారా ? అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఎలా ఇచ్చినా అది జనానికి చేరితే చాలు కదా. ఇక అక్కడితో ఆగక ఆయన కరోనా రోగులకు సేవలు అందిస్తున్న డాక్టర్ల కోసం 50 వేల సేఫ్టీ మెడికల్ కిట్స్ అందించనున్నారు.
ఇక ముంబయిలో తిండి లేక ఇబ్బంది పడుతున్న 5,500 మందికి నెలరోజుల పాటు ఆహార అవసరాలు తీర్చే బాధ్యత కూడా తన సంస్థలు తీసుకున్నాయని ఆయన ప్రకటించారు. ఇక తన టీం ముంబై వరకే ఈ కార్యక్రమాలను ఆపదని కోల్కతా, డిల్లీ నగరాల్లో కూడా తమ వంతు సహాయం చేస్తామని ప్రకటించారు.