English   

దళపతి విజయ్, అజిత్ తో ఆడుకుంటున్న విమర్శకులు..

vijay
2020-04-05 07:43:13

విజయ్, అజిత్ తమిళనాట స్టార్ హీరోలు. ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండస్ట్రీ లోనే అతి పెద్ద హీరోల్లో వీళ్లు కూడా ఉంటారు. ఒక్కో సినిమాకు దాదాపు 30 నుంచి 40 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. వీళ్ళ సినిమాలు కూడా చాలా ఈజీగా 100 కోట్లకు పైగా వసూలు చేస్తున్నాయి. తమిళనాట రజనీకాంత్ మేనియా తగ్గించి తమ జెండా ఎగరేస్తున్నారు విజయ్, అజిత్. ఇలాంటి ఇద్దరు హీరోలపై ఇప్పుడు విమర్శకులు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో ఇప్పటి వరకు ఈ ఇద్దరు హీరోల నుంచి ఎలాంటి విరాళం ఇండస్ట్రీకి అందలేదు. దాంతో అందరూ వీళ్లిద్దరిని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళ ఇండస్ట్రీ నుంచి రజినీకాంత్ 50 లక్షలు.. ధనుష్ 15 లక్షలు.. విజయ్ సేతుపతి 10 లక్షలు.. శివ కార్తికేయన్ 10 లక్షలు.. కమల్ హాసన్ 50 లక్షలు ఇచ్చారు. హీరోయిన్లలో నయనతార 20 లక్షలు సినిమా కార్మికుల కోసం ఇచ్చింది.

అయితే ఇప్పటివరకు విజయ్, అజిత్ మాత్రం ఈ విషయంలో ముందుకు రాలేదు. దాంతో ఇద్దరిని టార్గెట్ చేస్తున్నారు విమర్శకులు. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే ఈ ఇద్దరు హీరోలు ఎందుకు ఇవ్వడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏ ఆపద వచ్చినా కూడా అందరి కంటే ముందు విజయ్, అజిత్ కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అయితే ఈసారి మాత్రం వాళ్లు కాస్త ఆలస్యం చేస్తున్నారు. దానికి కూడా ఏవో కారణాలు ఉన్నాయి అంటున్నారు అభిమానులు. కానీ విమర్శకులు మాత్రం ఇదే అదునుగా ఇద్దరు హీరోలను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. నీతులు చెప్పడం కాదు ముందు విరాళం ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలవండి అంటూ విజయ్, అజిత్ ను ఓపెన్ గానే విమర్శిస్తున్నారు. మరి దీనికి సమాధానంగా ఈ ఇద్దరు హీరోలు విరాళం ఎంత ఇస్తారో చూడాలి.

More Related Stories