English   

సీరియల్ కష్టాలు మొదలు.. బుల్లితెరకు భారీ నష్టాలు..

serial
2020-04-06 07:39:17

సాధారణంగా ఎవరైనా కష్టపడుతుంటే పాపం సీరియల్ కష్టాలు వచ్చాయిరా అంటాం. కానీ ఇప్పుడు నిజంగానే సీరియల్ వాళ్లకు కష్టాలు వచ్చాయి. కరోనా వైరస్ ఏమో కానీ దాని కారణంగా సీరియల్స్ అన్నీ ఆగిపోయాయి.. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ ఆగిపోవడం.. నటులు అంతా ఇంటికే పరిమితం కావడంతో కొత్త ఎపిసోడ్లు లేక పాతవే రిపీట్ చేసుకుంటున్నారు. ఏ మాత్రం కరుణ లేని కరోనా వైరస్ ఇండియాను నిర్ధాక్షణ్యంగా నాశనం చేస్తుంది. దీని వల్ల అన్ని ఇండస్ట్రీలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. వేల కోట్ల నష్టాలను చవి చూస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ అయితే గత నెల రోజులుగా పూర్తిగా ఆర్ధిక నష్టాల్లో కూరుకుపోయింది. గత నాలుగు శుక్రవారాలు నుంచి ఎలాంటి సినిమాలు లేవు.. దానికి తోడు రాబోయే నెల రోజులు కూడా థియేటర్లు ఓపెన్ చేసే ఆలోచనలు కనిపించడం లేదు. దాంతో పాటు టెలివిజన్ ఇండస్ట్రీ కూడా దారుణంగా నష్టపోతుంది. సినిమాలు లేకపోతే హాయిగా టీవీ చూసుకోవచ్చు అనుకునే వాళ్లకు ఇప్పుడు అది కూడా షాక్ ఇచ్చింది.

ఈ వైరస్ కారణంగా వాళ్ళు కూడా ఇల్లు దాటి బయటకు రావడం లేదు. ప్రభుత్వం కూడా రావద్దనే చెప్పింది. దాంతో సీరియల్ షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. రియాలిటీ షోలు మ్యూజికల్ షోలు ఇలా అన్నీ షూటింగ్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దాంతో టెలివిజన్ లో స్లాట్స్ ఎలా ఫిల్ చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు యాజమాన్యం. మరో నెల రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా భారీ నష్టాల్లో కూరుకుపోతాం అంటున్నారు వాళ్ళు. అందులో కొన్ని సీరియల్స్ వారం వారం షూటింగ్ చేసుకునేవి ఉంటాయి. జబర్దస్త్ కామెడీ షో కూడా ఇప్పటికే ఆగిపోయింది. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీతో పాటు బుల్లితెరపై కూడా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంది. దీని దెబ్బకు సినిమాలు టెలివిజన్ దారుణంగా నష్టపోతున్నాయి. మళ్లీ ఈ పరిస్థితి ఎప్పటికీ బాగుపడుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు దర్శక నిర్మాతలు.  

 

More Related Stories